హైదరాబాద్ లో క్యాపిటాల్యాండ్ డేటా సెంటర్..
డేటా సెంటర్ మార్కెట్ కి హైదరాబాద్ క్యాపిటల్ గా మారుతోందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఐటీ ఆధారిత ఇతర ప్రాజెక్ట్ ల విషయంలో కూడా క్యాపిటా ల్యాండ్ తో కలసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు.
క్యాపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అవగాహనా ఒప్పందం ఖరారైంది. ఐటీ మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు ఎంఓయూ ప్రతులపై సంతకం చేశారు. దాదాపు 2.5 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు.
Very Happy to announce that @CapitaLand is investing in a Data Center in Hyderabad with a capacity of 36 MW and an investment ₹1200 Crores scheduled to be developed and deployed by the end of 2024
— KTR (@KTRTRS) December 6, 2022
MoU signed today for the same#HappeningHyderabad pic.twitter.com/mEOohSWRQs
మాదాపూర్ లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ (ITPH)లో ఈ డేటా సెంటర్ ఏర్పాటవుతుంది. ఈ భారీ డేటా సెంటర్ కోసం 36 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే సైట్ లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ కూడా ఉంటుంది. మూడు నుంచి ఐదేళ్లలో మొత్తం 1200 కోట్ల రూపాయల పెట్టుబడిని క్యాపిటా ల్యాండ్ సంస్థ ఈ ప్రాజెక్ట్ లో పెడుతుంది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ డేటా సెంటర్ భారీ సంస్థలకు తమ సేవలను అందించబోతోంది.
డేటా సెంటర్ మార్కెట్ కి హైదరాబాద్ కీలకం..
భారత్ లో తొలి డేటా సెంటర్ ని ముంబైలో ఏర్పాటు చేసిన క్యాపిటా ల్యాండ్ సంస్థ, రెండో డేటా సెంటర్ కోసం హైదరాబాద్ ని ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. డేటా సెంటర్ మార్కెట్ కి హైదరాబాద్ క్యాపిటల్ గా మారుతోందని చెప్పారు. హైదరాబాద్ లో విస్తరిస్తున్న ఐటీ పరిశ్రమకు ఇది మరింత ఊతం ఇస్తుందని అన్నారాయన. ఐటీ ఆధారిత ఇతర ప్రాజెక్ట్ ల విషయంలో కూడా క్యాపిటా ల్యాండ్ తో కలసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు మంత్రి కేటీఆర్.
ఆసియా, ఐరోపాలో 25 సెంటర్లు..
ప్రస్తుతం క్యాపిటా ల్యాండ్ గ్రూప్.. ఆసియా, ఐరోపా దేశాల్ల 25 డేటా సెంటర్లను కలిగి ఉంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ లో అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్టు తెలిపారు సంస్థ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తా. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.