Telugu Global
Telangana

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

ఈనెల 16న యశోద ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించినా ఆయన తిరిగి కోలుకోలేకపోయారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..
X

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.


కిడ్నీ సమస్యలతోపాటు, వారం రోజుల క్రితం ఆయనకు షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు సాయన్నను ఈనెల 16న యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు స్పందించినా ఆయన తిరిగి కోలుకోలేకపోయారు. కార్డియాక్ అరెస్ట్ తో ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

1994లో ఎమ్మెల్యేగా తొలి గెలుపు..

1951 మార్చి 5న జన్మించిన జి.సాయన్న.. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. 1984లో ఎల్.ఎల్.బి. పూర్తిచేశారు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు సాయన్న.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 నుండి 2009 వరకు మూడుసార్లు టీడీపీ తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. మొత్తం 5సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీ నుంచి బీఆర్ఎస్ కు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తిరిగి కంటోన్మెంట్ నుంచి గెలిచారు సాయన్న. ఆతర్వాత ఆయనను 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఎంపిక చేశారు.


2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారి తిరిగి అదే స్థానంలో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ పై 37,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు సాయన్న. రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతున్న ఆయన అనారోగ్యంతో అకాల మరణం చెందారు.

First Published:  19 Feb 2023 9:48 AM GMT
Next Story