దారి ఖర్చులిస్తాం.. కార్లుపెడతాం.. రండి బాబూ రండి
ఇప్పటివరకూ నియోజకవర్గాల్లో ప్రచారంపైనే దృష్టిపెట్టిన నేతలు.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న తమ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకనే ప్రయత్నాలు ప్రారంభించారు.
మీ ఇంట్లో రెండు ఓట్లున్నాయా.. రానూపోనూ ప్రయాణ ఛార్జీలిస్తాం.. నాలుగైదు ఓట్లున్నాయా కారు పెడతాం.. రండి బాబూ.. వచ్చి మా పార్టీకి ఓటేయండి.. హైదరాబాద్‌లోనూ, వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఓటర్లకు పార్టీల వినతులివి. విద్య, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌తోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న తమ ఓటర్లను ఓట్ల పండగకు సొంత ప్రాంతాలకు రప్పించేందుకు పార్టీలన్నీ ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
ప్రయత్నాలు ముమ్మరం
ఇప్పటివరకూ నియోజకవర్గాల్లో ప్రచారంపైనే దృష్టిపెట్టిన నేతలు.. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న తమ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించుకనే ప్రయత్నాలు ప్రారంభించారు.. ఆయా పార్టీల అభ్యర్థులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తమ నియోజకవర్గ ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారు. పోలింగ్ రోజు సొంతూరు వచ్చి ఓటేసేలా అభ్యర్థిస్తున్నారు. ఒకరిద్దరికి రానుపోను ఖర్చులు చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఓటర్లుంటే కారు డీజిల్ ఖర్చులతోపాటు ఓటుకింత ఇస్తామని చెబుతున్నారు.
ముంబై, బివండీ తదితర ప్రాంతాల్లో
తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రలకు ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో వలస వెళ్లిన వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును మాత్రమే ఇక్కడే ఉంచుకున్నారు. ముంబై, బివండీ, షోలాపూర్‌తోపాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న ఓటర్లపైనా దృష్టి సారించారు. ఇక హైదరాబాద్ నగరం నలుమూలలా స్థిరపడిన తెలంగాణలోని వేలమంది ఓటర్లు ఇప్పటికీ సొంతూళ్లోనే ఓటేయాలని ఓటు హక్కు స్వస్థలాల్లోనే ఉంచుకున్నారు. ఇలాంటి వారిని రప్పించేందుకు అభ్యర్థులు ఆయా కులపెద్దలను, ఓటర్ల బంధుమిత్రులను కలుస్తున్నారు. మనవాళ్లందరినీ రప్పించి, మన పార్టీకే ఓటేయించాలని అభ్యర్థిస్తున్నారు.