మందిలో మస్తు తిరగాలె.. పార్టీ సూచనతో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం షురూ
రాజధాని నగరంలోని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, గాంధీ, ముఠా గోపాల్, కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో ఎన్నికల మోడ్‌లోకి వచ్చేసింది. 115 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన కేసీఆర్ ఇక ప్రచారంలోకి దిగిపోవాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేశారు. టికెట్లు ప్రకటించిన రోజున శ్రేణులతో సంబరాలు చేసుకున్న అభ్యర్థులు మంగళవారం నుంచే ప్రచారం మొదలెట్టేశారు. ఎన్నికలయ్యే వరకు పూర్తిగా జనంలోనే ఉండండన్న పార్టీ సూచనతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
సీఎం ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యేలు
రాజధాని నగరంలోని ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, గాంధీ, ముఠా గోపాల్, కేపీ వివేకానంద, మాగంటి గోపీనాథ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశీస్సులు తీసుకుని ప్రచారం షూరు చేశారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ వీధుల్లో కాలినడకన తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బేగంపేట డివిజన్‌లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాగ్‌లింగంపల్లిలో వాకర్లను కలిసి పలకరించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మండలంలో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
జిల్లాల్లోనూ జోరు
అటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలను, నాయకులను కలుసుకోవడం ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, అధికారులతో సమీక్షలు చేస్తూ ప్రజాసమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు.
*