Telugu Global
Telangana

సోనియా గాంధీ సభ కోసం క్యాడర్ ఎదురు చూపు.. ఆ నాయకుల చేరిక ఖాయమేనా?

16 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతుండటమే కాకుండా సోనియా గాంధీ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో క్యాడర్ ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.

సోనియా గాంధీ సభ కోసం క్యాడర్ ఎదురు చూపు.. ఆ నాయకుల చేరిక ఖాయమేనా?
X

కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఫోకస్ చేసింది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరుగునున్నా.. పార్టీ దృష్టి మాత్రం రాష్ట్రంపైనే ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో అధికారానికి దూరమై దాదాపు దశాబ్దం కావొస్తుండటంతో నాయకులు, క్యాడర్‌లో కూడా నిరాశ మొదలైంది. బలమైన బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ వ్యూహాలను తట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడగలమా అనే అనుమానాలు క్యాడర్‌లో ఉన్నాయి. ఒకవైపు చేరికలు జోష్‌ను ఇస్తున్నా.. ఇంకా క్షేత్ర స్థాయిలో అనుకున్నంత ధీమా కనపడటం లేదు. దీంతో సోనియా గాంధీ సభ, సీడబ్ల్యూసీ నిర్ణయాలు క్యాడర్‌లో ఉత్సాహం నింపుతాయని భావిస్తున్నారు.

16 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతుండటమే కాకుండా సోనియా గాంధీ బహిరంగ సభలో పాల్గొంటుండటంతో క్యాడర్ ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. తొలుత పరేడ్ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల ఇప్పుడు తుక్కుగూడకు వేదికను మార్చారు. కనీసం 5 లక్షల మంది జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోనియా గాంధీ వస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ తరపున ఐదు హామీలను సోనియా ప్రకటిస్తారని తెలుస్తున్నది.

తుమ్మల, మైనంపల్లి చేరిక?

బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ కండువా కొప్పుకోనున్నట్లుతెలుస్తున్నది. పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పార్టీ అసమ్మతి గళం వినిపించారు. తన అనుచరులతో ఖమ్మంలో భారీ బలప్రదర్శన కూడా చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా తుమ్మలను కలిసి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. అందుకు ఆయన కూడా సమ్మతి తెలిపినట్లు వార్తలు వచ్చాయి.

ఇక బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. తనతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కేవలం సిట్టింగులకు మాత్రమే టికెట్లు ఇవ్వడంతో మైనంపల్లి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎన్నికల వ్యూహర్త సునిల్ కనుగోలు.. మైనంపల్లితో చర్చలు జరిపారు. హన్మంతరావుతో పాటు కొడుకు రోహిత్ కూడా కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.

తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంతరావులు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం దాదాపు ఖరారు అయ్యింది. ఇక ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు పూర్తి చేశారని.. 17న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తున్నది. సోనియా సభ, నాయకుల చేరికలతో పార్టీ క్యాడర్‌లో తప్పకుండా ఉత్సాహం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సభతో తెలంగాణ ఎన్నికల వార్ పూర్తిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుందని భావిస్తున్నారు.

First Published:  8 Sept 2023 7:55 AM IST
Next Story