Telugu Global
Telangana

రేపు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం కేసీఆర్?

రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపుపై కూడా ఎన్నికల ప్రణాళికలో చేర్చే అవకాశం ఉన్నది. దీనికై కేబినెట్‌లో ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

రేపు కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం కేసీఆర్?
X

తెలంగాణ కేబినెట్ భేటీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నది. మరో వారం పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న ప్రచారం నేపథ్యంలో.. ఇదే చివరి కేబినెట్ కావొచ్చని తెలుస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయితే మొదటి విడతలోనే తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. కాగా, ఎన్నికల ముందు జరుగనున్న కీలక కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు జనాకర్షక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే ప్రజలు ఇంకా కొత్తగా ఏమైనా ఆశిస్తున్నారా? అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందా? ఏ ప్రాంతమైనా అభివృద్ధిలో వెనుకబడిందా? అనే విషయాలు చర్చించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు మరిన్ని మెరుపులాంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై గ్రామాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది. అంతకు మించి మనమేమైనా ప్రకటించే అవకాశం ఉందా అనే విషయాలు కూడా చర్చించవచ్చని పార్టీ వర్గాలు చెప్పాయి.

బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఎలాంటి విషయాలు చేర్చాలనే విషయంపై కసరత్తు జరుగుతున్నది. అయితే ఎన్నికల షెడ్యూల్ లోపు ప్రభుత్వ పరంగా అద్భుతమైన పథకాన్ని ప్రకటించే వీలుందా అనే చర్చ జరగనున్నది. రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపుపై కూడా ఎన్నికల ప్రణాళికలో చేర్చే అవకాశం ఉన్నది. దీనికై కేబినెట్‌లో ముందుగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గత కేబినెట్‌ సిఫార్సు చేసి పంపింది. అయితే గవర్నర్ తమిళిసై వారిద్దరూ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారంటూ.. వారి పేర్లను రిజెక్ట్ చేశారు. అయితే మరోసారి వారిద్దరి పేర్లనే కేబినెట్ ఆమోదించి పంపనున్నట్ల తెలుస్తున్నది. కుర్రా సత్యనారాయణ కార్మిక వర్గాల నాయకుడిగా, దాసోజు శ్రవణ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాబట్టి వారు ఆ పదవులకు అర్హులే అని చెబుతూ మరోసారి ఫైలును రాజ్‌భవన్‌కు పంపనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ పెంపుకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరుగనున్నది. నిరుద్యోగుల కోసం కూడా ఒక పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు మహిళా బంధు కూడా రూపొందించాలని భావిస్తున్నారు. దీనిపై మంత్రి వర్గ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

First Published:  28 Sept 2023 4:15 PM IST
Next Story