తెలంగాణలో ఉపఎన్నికలు.. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు లోకల్ బాడీ ఎన్నికలు?
తెలంగాణలోని స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలు దాదాపు 6000 పైగా ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందే ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలు దాదాపు 6000 పైగా ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా ఈ పదవులకు ఎన్నికలు జరగక పోవడంతో కొందరు మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఉపఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. కోర్టు జారీ చేసిన నోటీసులపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మరోవైపు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేయడానికి అర్హత ఉన్న గుర్తింపు పార్టీల లిస్టును వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉపఎన్నికలకు సుముఖంగానే ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో 5,727 వార్డు మెంబర్లు, 344 ఉప సర్పంచ్‌లు, 246 సర్పంచ్‌లు, 120 ఎంపీటీసీలు, ఆరు ఎంపీపీలు, 3 ఉప ఎంపీపీలు, 3 జెడ్పీటీసీలు, 2 ఎంపీపీ కోఆప్షన్ మెంబర్లు, ఒక జెడ్పీ వైస్ చైర్ పర్సన్, 21 కౌన్సిలర్లు/కార్పొరేటర్ల స్థానాలు ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 2019లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 95 శాతం సీట్లు అధికార బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపఎన్నికలు మాత్రం జరపడంలో ఆలస్యం జరిగింది.
హైకోర్టు ఆదేశాలతో మరోసారి ఉపఎన్నికల విషయంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తే ఆయా పార్టీలకు ఉత్సాహం వస్తుంది. దీంతో ఉపఎన్నికల కోసం అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.