Telugu Global
Telangana

తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం-కేటీఆర్

సుప్రీం కోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం-కేటీఆర్
X

త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయంగా వస్తాయని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపోరాటం మొదలు పెట్టింది. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ ఫిరాయింపులపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కు, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేయబోతుందని చెప్పారు కేటీఆర్. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


గోడదూకినోళ్లకి బుద్ధి చెబుతాం..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు కేటీఆర్. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని ఢిల్లీలో న్యాయనిపుణులు బీఆర్ఎస్ బృందానికి తెలిపారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీం కోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని, హైకోర్టు కూడా ఎక్కువ కాలం ఈ అంశాన్ని వాయిదా వేసే అవకాశం లేదని చెప్పారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకపోతే, సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగాన్ని నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం నెలరోజుల్లో తేలిపోతుందని చెప్పారు. జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై సుద్ద పూస ముచ్చట్లు చెబుతున్న కాంగ్రెస్, తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అన్నారు. కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామన్నారు కేటీఆర్.

First Published:  5 Aug 2024 12:15 PM IST
Next Story