ఒకటి కాదు ఇకపై రెండు కొనాల్సిందే..
హెల్మెట్ ఉంటే కనీసం దాన్ని పెట్టుకోవాలన్న స్పృహ వస్తుందనే ఉద్దేశంతో ఇకపై ప్రతి వాహనదారుడు కొత్తగా బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్లు కూడా కొనుగోలు చేయాలనే నిబంధనను తెరపైకి తెస్తున్నారు.
బండి కొంటే దానితోపాటు అదనంగా హెల్మెట్ కొనాల్సిందే. అయితే కొన్నిచోట్ల షోరూమ్ ల వారే బండితోపాటు హెల్మెట్ ఫ్రీ అనే ఆఫర్లు ఇస్తుంటారు. ఇకపై వారు కూడా బండితో రెండు హెల్మెట్లు ఫ్రీ అనాల్సిన పరిస్థితి. ఎందుకంటే బండి కొంటే కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందేనంటూ తెలంగాణలో కొత్త నిబంధన రాబోతోంది. కొత్త బైక్ కొనుగోలు చేసే సమయంలో వాహనదారులు రెండు హెల్మెట్లు కొనుగోలు చేసేలా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో బైక్ ప్రమాదాల్లో మృతిచెందేవారి సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.
పెరుగుతున్న ప్రమాదాలు..
తెలంగాణలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం బైక్ లకు సంబంధించినవే ఉంటున్నాయి. మొత్తం ప్రమాదాల్లో 53 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయి. గతేడాది తెలంగాణలో 21,619 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 7,559 మంది మరణించారు. ఇందులో 10,653 బైక్ ప్రమాదాలు కాగా, మొత్తం 3,977 మంది బైకిస్ట్ లు మరణించారు. వీరిలో దాదాపు 1500మంది తలకు గాయాలై మరణించారని తెలుస్తోంది, అంటే వీరంతా హెల్మెట్ లేకుండా ప్రయాణించినవారే.
అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. బైక్ ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువే. వీటికి ప్రధాన కారణం హెల్మెట్ లేకపోవడం. హెల్మెట్ పెట్టుకున్నవాళ్లు ప్రమాదంలో గాయాలతో బయటపడితే లేనివాళ్లు దుర్మరణం పాలవుతున్నారు. కొన్నిసార్లు హెల్మెట్ ఉన్నా మరణాలు ఆగడంలేదు. అయితే అలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఇటీవల బైక్ ప్రమాదాల్లో ముందు హెల్మెట్ పెట్టుకున్న రైడర్ గాయాలతో బయటపడితే వెనక కూర్చున్నవాళ్లు హెల్మెట్ లేక ప్రాణాలొదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని నివారించేందుకే రెండు హెల్మెట్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు తెలంగాణ పోలీసులు.
వాహనం నడిపేవారే కాదు.. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ నిబంధన ఇప్పటికే అమలులో ఉంది, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. హెల్మెట్ ఉంటే కనీసం దాన్ని పెట్టుకోవాలన్న స్పృహ వస్తుందనే ఉద్దేశంతో ఇకపై ప్రతి వాహనదారుడు కొత్తగా బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్లు కూడా కొనుగోలు చేయాలనే నిబంధనను తెరపైకి తెస్తున్నారు. దానితోపాటే బండిపై వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనుకుంటున్నారు.
ఇకపై తెలంగాణలో బైక్ కొనుగోలు చేసే సమయంలో రెండు హెల్మెట్లు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, అవసరమైతే రవాణా శాఖ నిబంధనలలో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి పంపాలని పోలీసు శాఖ ఆలోచిస్తోంది.