Telugu Global
Telangana

ఆ రూట్లలోనే చార్జీల పెంపు.. టీజీఎస్ఆర్టీసీ వివరణ

ఆర్టీసీ దూర ప్రయాణాల్లో దాదాపుగా ప్రతి బస్సు టోల్ గేట్ దాటాల్సి వస్తుంది. ప్రయాణంలో ఒకటికి రెండు టోల్ గేట్లు ఉంటే.. చార్జీలో తేడా స్పష్టంగా తెలుస్తుంది.

ఆ రూట్లలోనే చార్జీల పెంపు.. టీజీఎస్ఆర్టీసీ వివరణ
X

తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెంచిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కానీ కొన్ని చోట్ల ప్రయాణికులు పాత చార్జీలనే చెల్లిస్తున్నారు. కొన్ని రూట్లలో మాత్రమే చార్జీలు పెరిగాయి. అది కూడా నామమాత్రంగానే. అయితే సాధారణ చార్జీలు పెరిగాయంటూ వార్తలు రావడంతో టీజీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. సాధారణ చార్జీలను పెంచలేదని స్పష్టం చేసింది.

మరి పెరిగిన చార్జీల సంగతేంటి..?

ఇటీవల దేశవ్యాప్తంగా టోల్ చార్జీలు పెరిగాయి. వాటిని సర్దుబాటు చేస్తూ ఆయా రూట్లలో ఆర్టీసీ కూడా టోల్ సెస్ పెంచింది. టోల్ సెస్ ని టికెట్ లో భాగంగానే వసూలు చేస్తారు. దీంతో చార్జీలు పెరిగినట్టే కదా అని ప్రయాణికులు ఫిక్స్ అయ్యారు. అయితే కేవలం టోల్ రూట్ల ద్వారా వెళ్లే బస్సుల్లో మాత్రమే టోల్ సెస్ మేరకే చార్జీలు పెంచినట్టు సంస్థ వివరణ ఇచ్చింది. పెరిగిన టోల్ భారం సంస్థపై పడకుండా ఉండేందుకే చార్జీలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని, ఇదీ సాధారణ పెంపు కాదని వివరణ ఇచ్చింది.

ఆర్టీసీ దూర ప్రయాణాల్లో దాదాపుగా ప్రతి బస్సు టోల్ గేట్ దాటాల్సి వస్తుంది. ప్రయాణంలో ఒకటికి రెండు టోల్ గేట్లు ఉంటే.. చార్జీలో తేడా స్పష్టంగా తెలుస్తుంది. సిటీ సర్వీస్ లకు, అతి తక్కువ సందర్భాల్లో పల్లెవెలుగు బస్సులకు మాత్రమే టోల్ అవస్థ ఉండదు, అంటే ఆ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెరగలేదు. ఆయా సర్వీసులు మినహా మిగతా చోట్ల చార్జీల సవరణ జరిగిందనేది వాస్తవం. కానీ సంస్థ ఉద్దేశపూర్వకంగా చార్జీలు పెంచలేదని, టోల్ చార్జీల సవరణతోనే సెస్ పెంచాల్సి వచ్చిందనేది టీజీఎస్ఆర్టీసీ వాదన. ఏ చార్జీలు ఎంత పెరిగినా మహిళలు మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యంతో సంతోషంగా ఉన్నారు.

First Published:  13 Jun 2024 3:07 AM GMT
Next Story