టీజీపీఎస్పీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం
డిసెంబర్ 3న ముగియనున్న మహేందర్‌రెడ్డి పదవీ కాలం
టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ప్రస్తుత ఛైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3న ముగియనున్నది. ఈ నేపథ్యంలో కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిపికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా సుమారు 45 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు ప్రొఫెసర్లు కూడా ఈ పోస్టు కోసం అప్లై చేసుకున్నారు. వీరిలో బుర్రా వెంకటేశం పేరును సీఎం ఎంపిక చేసి నియామకం ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించగా గవర్నర్ ఆమోదం తెలిపారు.
టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులు కావడంతో ఇప్పుడున్న అన్ని పోస్టులకు బుర్రా వెంకటేశం రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ఆయన వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేయడంతో ప్రభుత్వం ఆమోదించనున్నది. డిసెంబర్ 2న వెంకటేశం బాధ్యతలు చేపట్టనున్నారు. టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమితులవడం పట్ల సంతోషంగా ఉన్నదని వెంకటేశం తెలిపారు.
బుర్రా వెంకటేశం 1969 ఏప్రిల్ 10 జనగామ జిల్లాలో జన్మించారు. 1995లో ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బుర్రా వెంకటేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి. గురుకులాల్లో చదివిన విద్యార్థి ఐఏఎస్‌గా మారారని సీఎం రేవంత్‌రెడ్డి పలు వేదికలపై బుర్రా వెంకటేశం గురించి ప్రస్తావించిన విషయం విదితమే.