ఆర్టీసీ బస్సులో డెలివరీ.. వారిద్దరికీ బంపర్ ఆఫర్
మహిళకు ఏ ఇబ్బంది లేకుండా బస్ లోనే కాన్పు అయ్యేలా చూసి, సపర్యలు చేసిన గద్వాల్ డిపో కండక్టర్ భారతి, డ్రైవర్ అంజి, నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్ లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది.
ఆర్టీసీ బస్‌లో జన్మించిన చిన్నారికి జీవితకాలం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ పాస్ అందిస్తున్నట్టు TGSRTC యాజమాన్యం ప్రకటించింది. కాన్పు సక్రమంగా జరిగేందుకు సాయపడిన నర్స్ కు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మహిళా కోటాలో ఎక్స్ ప్రెస్ సర్వీస్ వరకు ఆమె ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇకనుంచి ఆ నర్స్ కు డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఏడాదిపాటు ఫ్రీ గా ప్రయాణించేందుకు బస్ పాస్ అందించారు అధికారులు.
▶️ఆర్టీసీ బస్‌లో జన్మించిన చిన్నారికి జీవితకాలం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్ పాస్
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 20, 2024
▶️సాయపడిన నర్సుకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం
▶️ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం
▶️డెలివరీ చేసి ఉదారత చాటిన వారికి ఘన సన్మానం.. నగదు బహుమతుల అందజేత… pic.twitter.com/LPWreP9109
రాఖీ పండగ రోజు గద్వాల-వనపర్తి రూట్ లో వెళ్లే పల్లె వెలుగు బస్ లో నిండు గర్భిణి ఎక్కారు. తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఆమె వనపర్తి వెళ్లేందుకు బస్ ఎక్కారు. అయితే బస్సు నాచహల్లి దగ్గరకు రాగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే మహిళా కండక్టర్ అప్రమత్తమయ్యారు. బస్సుని రోడ్ పక్కన ఆపించారు. అదే బస్ లో ప్రయాణిస్తున్న నర్సు సాయంతో ఆమెకు పురుడుపోశారు. ఆడబిడ్డ పుట్టింది. ఆ తర్వాత తల్లీ బిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్ లో ప్రసవం అంటూ ఈ వార్త వైరల్ గా మారింది.
మహిళకు ఏ ఇబ్బంది లేకుండా బస్ లోనే కాన్పు అయ్యేలా చూసి, సపర్యలు చేసిన గద్వాల్ డిపో కండక్టర్ భారతి, డ్రైవర్ అంజి, నర్సు అలివేలు మంగమ్మను హైదరాబాద్ బస్ భవన్ లో ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. వారిని సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బస్ పాస్‌ను నర్సు అలివేలు మంగమ్మకు డిపో మేనేజర్ అందించారు. బస్ లో పుట్టిన చిన్నారికి జీవిత కాలం ఉచిత బస్ పాస్‌ను ఇచ్చారు. పుట్టింది ఆడబిడ్డే కాబట్టి.. సహజంగానే ఆ పాప ఉచిత రవాణా సౌకర్యానికి అర్హురాలు. అయితే ఆ పథకంతో సంబంధం లేకుండా ఆర్టీసీ యాజమాన్యం ఆ అమ్మాయికి జీవిత కాల బస్ పాస్ ని అందిచడం విశేషం.