బుద్వేల్ లో వేలంపాట అ'ధర'హో..
రాజేంద్రనగర్ లో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ రోడ్డుకు ఈ వెంచర్ అతి సమీపంలో ఉంది. విమానాశ్రయం, ఐటీ కారిడార్ దగ్గర కావడంతో ఈ భూములకు రేటు పెరిగింది. ఈ లేఅవుట్ ను ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రోస్టేషన్ కు అనుసంధానం చేస్తారన్న వార్తల నేపథ్యంలో డిమాండ్ బాగా పెరిగింది.
కోకాపేట రికార్డులు బద్దలు కాలేదు కానీ, అంచనాలను మించి బుద్వేల్ భూములకు రేటు పలికింది. అత్యధికంగా ఎకరం రూ.41.75కోట్లు పలికింది. ప్రభుత్వం ఇక్కడ ఎకరాకు 20కోట్ల రూపాయల కనిష్ట ధర నిర్ణయించగా.. ఒక ప్లాట్ రెట్టింపు రేటు పలకడం విశేషం.
హైదరాబాద్ రాజేంద్రనగర్ బుద్వేల్ గుట్టపై ఉన్న 100 ఎకరాలను HMDA వేలం వేసింది. రెండు సెషన్లలో ఈ వేలం జరిగింది. 100 ఎకరాలను మొత్తం 14 ప్లాట్లుగా విభజించింది. ఇందులో ఏడు ప్లాట్లు రూ.2,057 కోట్లకు, మరో ఏడు ప్లాట్లు రూ.1,568.06 కోట్లకు అమ్ముడుపోయాయి. అత్యధికంగా 15వ ప్లాట్ ఎకరాకు రూ.41.75 కోట్లు పలికింది. కనిష్టంగా రెండో నెంబర్ ప్లాట్ ఎకరా రూ.33.25కోట్లు పలికింది.
కోకాపేటకు పోటీగా బుద్వేల్..
కోకాపేట భూములకు వచ్చిన హైప్ తో బుద్వేల్ లో కూడా అదే ఊపు కొనసాగింది. అందులోనూ వెంట వెంటనే భూముల వేలం జరగడం కూడా బుద్వేల్ కు బాగా కలిసొచ్చింది. కోకాపేటలో ఎకరం కనీస ధర రూ.35కోట్లుగా నిర్ణయించారు, కానీ అది 100కోట్లపైకి చేరింది. బుద్వేల్ లో ఎకరం కనీస ధర రూ.20కోట్లుగా నిర్ణయించగా, అది రూ.41.75 కోట్లు పలికింది.
బుద్వేల్ ప్రత్యేకతలు ఏంటంటే..?
బుద్వేల్ లేఅవుట్ కు ఒకవైపు హిమాయత్ సాగర్ వ్యూ కనిపిస్తుండగా, మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం ఉన్నాయి. రాజేంద్రనగర్ లో ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ రోడ్డుకు ఈ వెంచర్ అతి సమీపంలో ఉంది. విమానాశ్రయం, ఐటీ కారిడార్ దగ్గర కావడంతో ఈ భూములకు రేటు పెరిగింది. ఈ లేఅవుట్ ను ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రోస్టేషన్ కు అనుసంధానం చేస్తారన్న వార్తల నేపథ్యంలో డిమాండ్ బాగా పెరిగింది. కోకాపేట వేలంలో పాల్గొన్న కంపెనీలు ఇక్కడ కూడా భూములకోసం పోటీ పడ్డాయి. పోటీ పెరగడంతోనే బుద్వేల్ కి రేటు కలిసొచ్చింది.