చేతబడి నెపంతో తల్లీకుమారుడి దారుణ హత్య
వివాదాల నేపథ్యంలో సమ్మన్న గత ఐదేళ్లుగా వరంగల్‌లో ఉంటున్నాడు. కుమారస్వామి గూడూరులోనే నివాసం ఉంటున్నాడు. కేసుల నేపథ్యంలో మంగళవారం రెండు కుటుంబాలవారు పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు.
చేతబడుల నెపంతో తల్లీకుమారులను దారుణంగా హతమార్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సమ్మన్న (40) కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా చేతబడులు చేస్తున్నారంటూ కుమారస్వామి కుటుంబం వారితో తరచూ గొడవలు పడుతోంది. ఈ నేపథ్యంలో వారిపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ వివాదాల నేపథ్యంలో సమ్మన్న గత ఐదేళ్లుగా వరంగల్‌లో ఉంటున్నాడు. కుమారస్వామి గూడూరులోనే నివాసం ఉంటున్నాడు. కేసుల నేపథ్యంలో మంగళవారం రెండు కుటుంబాలవారు పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. వారు తిరిగి వెళుతుండగా మార్గంలో వారిమధ్య వాగ్వివాదం జరిగింది. మాటామాటా పెరిగి కుమారస్వామి సమ్మన్న కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్డుతో సమ్మన్నను, అతని తల్లి సమ్మక్క (60), తండ్రిని తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనలో సమ్మన్న, సమ్మక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన సమ్మన్న తండ్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.