Telugu Global
Telangana

హైదరాబాద్‌లో భార్యాభర్తల దారుణ హత్య.. ఎందుకో తెలుసా..?

గత నెల 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అహ్మద్‌ ఖాద్రీ తిరిగి రాలేదు. 29న రాత్రి ఫాతిమాకు హుమాయున్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె అక్క మునీర్‌ ఫాతిమా పలుమార్లు ఫోన్‌ చేసినా తీయలేదు.

హైదరాబాద్‌లో భార్యాభర్తల దారుణ హత్య.. ఎందుకో తెలుసా..?
X

హైదరాబాద్ ఫిల్మ్‌ నగర్‌లో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో భార్యాభర్తల్ని కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు అన్వర్. ఈ ఘటన గతనెల 28న జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సయ్యద్‌ అహ్మద్‌ ఖాద్రీ (42) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. 2014లో సయీదా మిరాజ్‌ ఫాతిమా (40)తో వివాహమైంది. వీళ్లు ఫిలింనగర్‌ సత్యాకాలనీ పయోనీర్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. మేకల వ్యాపారం కోసమని రెండేళ్ల కిందట నదీం కాలనీలో ఉంటున్న అన్వర్‌ నుంచి రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నాడు ఖాద్రీ. కానీ, ఆ డబ్బు ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వాలని అన్వ‌ర్ పలుమార్లు ఖాద్రీని ఇంటికి వచ్చి నిలదీశాడు. తమకు వేరేదగ్గర డబ్బులు రావాల్సి ఉందని, అవి రాగానే ఇస్తామంటూ స‌ర్థిచెప్పుకుంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలో గత నెల 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అహ్మద్‌ ఖాద్రీ తిరిగి రాలేదు. 29న రాత్రి ఫాతిమాకు హుమాయున్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె అక్క మునీర్‌ ఫాతిమా పలుమార్లు ఫోన్‌ చేసినా తీయలేదు. ఖాద్రీకి కాల్‌ చేయగా అతడూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి సత్యాకాలనీలోని ఫాతిమా ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి గ్యాస్‌ వాసన రావడంతో తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. బట్టల మూటల కింద మిరాజ్‌ ఫాతిమా డెడ్‌బాడీ కనిపించింది. దీంతో మృతురాలి అక్క మునీర్‌ ఫాతిమా గతనెల 30న ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిరాజ్‌ ఫాతిమా భర్త ఖాద్రీ ఆమెను హత్యచేసి పారిపోయి ఉంటాడని పోలీసులకు చెప్పింది. పిల్లలు పుట్టడం లేదని తరచూ వేధిస్తుండే వాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఖాద్రీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు షాకింగ్‌ నిజాలు తెలిశాయి. ఫాతిమా హత్యకు ముందే ఆమె ఇంటికి ముగ్గురు వ్యక్తులు రావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. చేతిలో బిర్యానీ ప్యాకెట్‌తో ముగ్గురు ఫాతిమా ఇంట్లోకి వెళ్లారు. ఆ ముగ్గురు ఎవరు..? అని ఆరా తీయగా ఫాతిమా భర్త ఖాద్రీకి అప్పు ఇచ్చిన అన్వర్‌ కూడా వారిలో ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతనెల 28న రాత్రి నదీమ్‌ కాలనీలో చెరువు వద్దకు ఖాద్రీని పిలిపించాడు అన్వర్. స్నేహితులతో కలిసి ఖాద్రీని దారుణంగా హత్య చేసి చెరువువద్ద గొయ్యి తీసి పాతిపెట్టాడు. హత్య విషయం బయటకు రావద్దంటే ఖాద్రీ భార్య మిరాజ్‌ ఫాతిమాను కూడా చంపేయాలని నిర్ణయించుకున్నారు. మిరాజ్‌ ఫాతిమా ఇంటికి వచ్చి ఆమెను చున్నీతో గొంతు బిగించి చంపేశారు. బట్టలమూట కింద శవాన్ని దాచిపెట్టి పారిపోయారు. నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఫిలింనగర్‌ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. హత్యకు గురైన ఖాద్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.

First Published:  9 Dec 2023 3:50 PM IST
Next Story