Telugu Global
Telangana

గురుకుల బాటకు బయల్దేరిన బీఆర్‌ఎస్‌వీ

జెండా ఊపి ప్రారంభించిన ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌

గురుకుల బాటకు బయల్దేరిన బీఆర్‌ఎస్‌వీ
X

రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి బీఆర్‌ఎస్‌వీ నాయకులు శనివారం గురుకుల బాటకు బయల్దేరారు. తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేళ్ల పాటు దేశానికే దిక్సూచీగా సేవలందించిన తెలంగాణ గురుకులాలు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్వాన స్థితికి దిగజారాయన్నారు. ఫుడ్‌ పాయిజన్‌, ఇతర కారణాలతో 48 మంది విద్యార్థులు 11 నెలల కాలంలో మృత్యువాత పడ్డారని తెలిపారు. గురుకులాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వాటిలో ప్రమాణాలను దిగజారుస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఎస్‌సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు విద్యార్థి నాయకులు రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లను సందర్శించి వాటిలో పరిస్థితులపై పార్టీకి నివేదిక సమర్పిస్తారు.





గురుకుల బాటకు వెళ్తోన్న మాజీ మంత్రి కొప్పుల అరెస్ట్‌

చొప్పదండి, మల్లాపూర్‌, అల్లీపూర్‌, ధర్మపురిలోని వివిధ గురుకులాల పాఠశాలల్లో పరిస్థితులు తెలుసుకునేందుకు కరీంనగర్‌ నుంచి బయల్దేరిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ను కరీంనగర్‌ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. అనంతరం శ్రీపురం కాలనీలోని తన నివాసానికి తరలించి గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు చుట్టూ మోహరించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో 11 నెలల్లో 50 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వాంకిడి గురుకులం విద్యార్థిని శైలజ కలుషిత ఆహారం తిని 21 రోజులు నిమ్స్‌ లో చికిత్స పొందుతూ చనిపోయిందని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను చిన్నాభిన్నం చేయాలని రేవంత్‌ రెడ్డి కంకణం కట్టుకున్నారని అన్నారు.

First Published:  30 Nov 2024 5:05 PM IST
Next Story