Telugu Global
Telangana

హైదరాబాద్ లో బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్

ఈరోజు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు నేతలు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్
X

మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ, పోటీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్వీ నేతలు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్వీ నేతల్ని అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్లకి తరలించారు. పోలీస్ స్టేషన్ల వద్ద కూడా నేతలు నినాదాలు చేశారు. అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. పోలీసుల వైఖరిని వారు ఖండించారు.


ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్-2, 3 నోటిఫికేషన్లో పోస్ట్ ల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్-1 మెయిన్స్ కి 1ః100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలనేవి నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు. ఈ డిమాండ్లతోనే ఇటీవల కొంతమంది దీక్షలకు దిగారు. అయితే సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి, దీక్షలను అపహాస్యం చేస్తూ మాట్లాడారు. దీక్షల్లో కూర్చున్నవారెవరూ అభ్యర్థులు కాదని, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు దీక్షలతో పనేంటని నిలదీశారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అభ్యర్థుల మనోభావాలను సీఎం దెబ్బతీసేలా మాట్లాడారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన అభ్యర్థులు, వారికి మద్దతుగా తరలి వచ్చిన బీఆర్ఎస్వీ నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈరోజు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు నేతలు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులు కోరినట్టుగా పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టమేమీ లేదు, ఆ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకుంటున్నారు. కానీ వాయిదా వేస్తే, అది ప్రతిపక్ష విజయం అవుతుందని ఆయన వెనక్కు తగ్గుతున్నారు. ఆ నెపాన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపైకి నెట్టేస్తున్నారు. పరీక్షలు వాయిదా పడితే ఒక్కో కోచింగ్ సెంటర్ కి 100 కోట్ల రూపాయల లాభం వస్తుందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అభ్యర్థులు మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని, పోస్ట్ ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ఈ గొడవ రోజు రోజుకీ పెద్దదవుతోంది.

First Published:  15 July 2024 6:48 AM GMT
Next Story