Telugu Global
Telangana

సారీ పల్లవి మమ్మల్ని క్షమించు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్

గూండాలు ఇంట్లోకి ప్రవేశించి కళ్ల ఎదుటే తల్లిదండ్రుల్ని చావగొడుతుంటే చిన్నారి పల్లవి (పావ‌ని) గుండె ఎంత తల్లడిల్లి ఉంటుందో అని కేటీఆర్ అన్నారు.

సారీ పల్లవి మమ్మల్ని క్షమించు.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
X

సూర్యాపేట జిల్లాలో విషాదం జరిగింది. రెండు కుటుంబాల మధ్య కక్షలు ఓ బాలిక (14) మృతికి కారణమయ్యాయి. కళ్లెదుటే తల్లిదండ్రులపై జరిగిన దాడిని చూసి భయాందోళనలకు గురైన కుమార్తె హఠాన్మరణం చెందింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది.

డి.కొత్తపల్లికి చెందిన కాసం సోమయ్య దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సోమయ్యకు, అదే గ్రామానికి చెందిన కడారి సైదులుకు కొన్నేళ్లుగా కుటుంబ కలహాలున్నాయి. గతంలో గ్రామ‌ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సోమయ్య వ్యవసాయం వదిలేసి సూర్యాపేటకు వెళ్లి మెకానిక్‌గా స్థిరపడ్డాడు. సైదులు వ్యవసాయం చేస్తున్నాడు. 6 నెలల కిందట తన కుమార్తె పావని అనారోగ్యానికి గురవడంతో అప్పటి నుంచీ సోమయ్య కుటుంబంతో కలిసి మళ్లీ సొంతూరుకు వచ్చి ఉంటున్నాడు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో పెట్టుకున్న సైదులు.. గురువారం రాత్రి కడారి సోమయ్య, కాసం కళింగం అనే ఇద్దరితో కలిసి కాసం సోమయ్య ఇంటికి వెళ్లాడు. కర్రలు, రాడ్లతో కాసం సోమయ్య దంపతులపై దాడి చేయడంతో వారిద్దరూ గాయపడ్డారు. తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసిన పావని.. భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కన్నబిడ్డ మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


ఘటనపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్త విని తన గుండె ధ్రవించిపోయిందని ట్వీట్ చేశారు. గూండాలు ఇంట్లోకి ప్రవేశించి కళ్ల ఎదుటే తల్లిదండ్రుల్ని చావగొడుతుంటే చిన్నారి పల్లవి (పావ‌ని) గుండె ఎంత తల్లడిల్లి ఉంటుందో అని కేటీఆర్ అన్నారు. సాయం కోసం ఆమె ఎంతలా విలపించి ఉంటుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని తన క‌ళ్ల‌ముందే కొడుతుంటే చూసి తట్టుకోలేక పల్లవి కుప్పకూలిపోయిందన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు కేటీఆర్‌. పల్లవి.. మమ్మల్ని క్షమించు నిన్ను కాపాడుకోవటంలో మేము విఫలమయ్యామని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

First Published:  17 Aug 2024 11:28 AM IST
Next Story