Telugu Global
Telangana

అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా..

ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని, ఈ ఓటమి బీఆర్ఎస్ కి కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని చెప్పారు కేటీఆర్. ఆరు గ్యారంటీలే కాదు.. కాంగ్రెస్‌ 412 హామీలు ఇచ్చిందని, నిరుద్యోగ భృతిపై ఆల్రడీ నాలుక మడతేసిందని గుర్తు చేశారు.

అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా..
X

శ్వేత పత్రం వర్సెస్ స్వేద పత్రం అన్నట్టుగా మారిపోయాయి తెలంగాణ రాజకీయాలు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేత పత్రాలకు ప్రతిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో స్వేద పత్రం విడుదల చేశారు. గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఆయన వివరించారు. కోట్లమంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరుని వివరించేదే ఈ స్వేదపత్రం అన్నారాయన. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో రాష్ట్ర ప్రగతిని వివరించారు కేటీఆర్.


కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ పాలనను బద్నాం చేయాలనుకుంటోందని మండిపడ్డారు కేటీఆర్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట అని మండిపడ్డారు. అదొక అంకెల గారడీ, అభాండాల చిట్టా అన్నారు. ప్రభుత్వం చేసిన ఆరోపణలు, విమర్శలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పామని, తమకు తగినంత సమయం ఇవ్వకుండా సభ వాయిదా వేసుకొని పోయారని విమర్శించారు. అందుకే బాధ్యతగల పార్టీగా ‘స్వేద పత్రం’ విడుదల చేస్తున్నామన్నారు.

తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లుగా ఉంటే, కాంగ్రెస్‌ నేతలు దాన్ని రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలను, గ్యారంటీ ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని వివరించారు. బట్టకాల్చి మీద వేయాలనుకుంటే సహించబోమన్నారు. ఆర్టీసీ, విద్యుత్‌, పౌరసరఫరాల శాఖలో లేని అప్పు ఉన్నట్లు చూపిస్తున్నారని శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనకంటే ముందు 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ద అబద్ధం అన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి అస్థిత్వమే కాదు, ఆస్తులు కూడా సృష్టించామన్నారు కేటీఆర్. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు. విద్యుత్‌ రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు. విద్యుత్‌ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామని వివరించారు కేటీఆర్. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని, కాళేశ్వరం ద్వారా కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరి చేయాలంటున్నామని, కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని చెప్పారు. తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. ఇప్పటికే 90శాతం పూర్తి చేసిన పాలమూరు - రంగారెడ్డి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి నీరు ఇవ్వాలన్నారు. ఫలాలు అనుభవించండి కానీ, ప్రాజెక్టులను బద్నాం చేయొద్దని సూచించారు.

అది స్పీడ్ బ్రేకర్ మాత్రమే..

చేసిన పనిని తాము మరింత ప్రభావవంతంగా చెప్పుకోవాల్సిందని అన్నారు కేటీఆర్. ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని, ఈ ఓటమి బీఆర్ఎస్ కి కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని చెప్పారు. ఆరు గ్యారంటీలే కాదు.. కాంగ్రెస్‌ 412 హామీలు ఇచ్చిందని, నిరుద్యోగ భృతిపై ఆల్రడీ నాలుక మడతేసిందని గుర్తు చేశారు. సుపరిపాలన అందిస్తారా... లేక బీఆర్ఎస్ పై కక్ష సాధిస్తారా.. అనేది వారి ఇష్టానికే వదిలేస్తున్నామని చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలో 1.11లక్షల కుటుంబాలకు రైతుబీమా అందితే.. అవన్నీ రైతు ఆత్మహత్యలేనంటూ ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని.. ఆయన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడంలేదన్నారు. సహజ మరణాలకు కూడా రైతుబీమా అందుతుందనే విషయం వారికి తెలియదన్నారు. వాళ్ల పరిజ్ఞానం అదీ అంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

First Published:  24 Dec 2023 3:22 PM IST
Next Story