కొడంగల్‌లోనే గెలవలేదు.. కామారెడ్డిలో గెలుస్తావా..? రేవంత్‌పై కేటీఆర్ సెటైర్
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాలో కేటీఆర్ పర్యటించారు. అక్కడ రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
కొడంగల్‌లోనే గెలవలేని నాయకుడు కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి గెలుస్తాడా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానంటూ ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాలో కేటీఆర్ పర్యటించారు. అక్కడ రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి భయపడుతున్నారని.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్నారు. కొడంగల్ లోనే గెలవని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డి డిపాజిట్‌ను కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని చెప్పారు.
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం మన అదృష్టమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రాని భారీ మెజారిటీ కామారెడ్డి నుంచి రావాలని అన్నారు. కామారెడ్డిని సిరిసిల్ల కంటే ఎక్కువగా చూసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మళ్లీ చీకటి రోజులకు వెళ్తామని, కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.