నర్సయ్యకోసం విదేశాంగ శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ
గతంలో దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తూ నరకయాతన పడుతున్న ఐదుగురు సిరిసిల్ల వాసులను విడిపించారు కేటీఆర్. తాజాగా బహ్రెయిన్ జైలులో మగ్గిపోతున్న నర్సయ్యకు అండగా నిలబడతానన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తనవంతు సాయం చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారని అంటారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా నర్సయ్య అనే ఓ బాధితుడి కోసం విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు కేటీఆర్. పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైలులో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి నర్సయ్యను ఎలాగైనా విడిపించాలని, ఈ విషయంలో విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
పాస్‌పోర్ట్ పొగొట్టుకొని బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి నర్సయ్య కోసం విదేశాంగ మంత్రికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
— BRS Party (@BRSparty) August 11, 2024
విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి.
నర్సయ్యను భారత్ కు రప్పించేందుకు కృషి చేస్తానన్న కేటీఆర్.… pic.twitter.com/tBltQvqZ28
సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన 62 ఏండ్ల మానువాడ నర్సయ్య పాస్ పోర్ట్ పోగొట్టుకుని బహ్రెయిన్ జైలులో ఖైదీ అయ్యాడు. 28 ఏళ్ల క్రితం ఆయన బహ్రెయిన్ వెళ్లాడు. అక్కడ తాపీమేస్త్రీగా పనిచేసేవాడు. 1999 ఆగస్ట్ లో ఆయన వర్క్ పర్మిట్ ముగిసినా అక్కడే పనిచేస్తూ ఉన్నాడు. 2001లో పాస్ పోర్ట్ గడువు ముగియటంతో బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ రెన్యువల్ చేసింది. ఇప్పుడు ఆ పాస్ పోర్ట్ కూడా పోవడంతో ఆయన్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్ పోర్ట్, వర్క్ పర్మిట్ లేకుండా అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడంటూ జైలులో వేశారు. జనవరి నుంచి ఆయన జైలులో మగ్గిపోతున్నాడు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో, ఆయన వెంటనే బహ్రెయిన్ లోని బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అలర్ట్ చేశారు. నర్సయ్య విడుదలకు సహకరించాలని సూచించారు. నర్సయ్యకు తాత్కాలిక పాస్‌పోర్ట్ ను ఇచ్చే విషయంలో చొరవ చూపాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ కి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను కేటీఆర్ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తి సహకారం అందించి నర్సయ్య పాస్ పోర్ట్ జారీ అయ్యేలా చూడాలని కోరారు.
గతంలో దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తూ నరకయాతన పడుతున్న ఐదుగురు సిరిసిల్ల వాసులను విడిపించారు కేటీఆర్. వారి విడుదల కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి విజయవంతం అయ్యారు. జైలులో మగ్గిపోవాల్సిన వారికి కొత్త జీవితాలనిచ్చారు. తాజాగా బహ్రెయిన్ జైలులో మగ్గిపోతున్న నర్సయ్యకు కేటీఆర్ అండగా నిలబడతానన్నారు. ఆయన విడుదలకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాాలు చొరవ తీసుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు.