కౌంట్‌డౌన్ స్టార్టయింది - కేటీఆర్
కాళేశ్వరంపై ఎక్కడైనా విచారణకు సిద్ధమన్నారు కేటీఆర్. వైట్ పేపర్లు, ల్యాండ్ క్రూయిజర్ లాంటి వివాదాలు కేవలం కాంగ్రెస్ హామీల నుంచి దృష్టి మరల్చేందుకేనన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ వాయిస్ వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలుగువారికి ఎన్టీఆర్ ప్రాతినిథ్యం వహించిన తరహాలోనే.. కేసీఆర్ తెలంగాణకు ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకున్నప్పటికీ.. దాని కేంద్రం తెలంగాణనే అని స్పష్టంచేశారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమేనన్న కేటీఆర్.. బీఆర్ఎస్ లేకపోతే లోక్‌సభలో తెలంగాణ అనే పదం వినిపించదన్నారు. రాహుల్ గాంధీ ఏనాడైనా తెలంగాణ అంశాలను లోక్‌సభలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు.
కాళేశ్వరంపై ఎక్కడైనా విచారణకు సిద్ధమన్నారు కేటీఆర్. వైట్ పేపర్లు, ల్యాండ్ క్రూయిజర్ లాంటి వివాదాలు కేవలం కాంగ్రెస్ హామీల నుంచి దృష్టి మరల్చేందుకేనన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం మానుకోవాలన్నారు కేటీఆర్. దేశంలో దివాళా తీసిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని అరుస్తోందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ 420 ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్నారు. హామీల అమలుకు ఇప్పటికే 30 రోజులు పూర్తయ్యాయని.. మరో 70 రోజులు గడువు ఉందన్నారు కేటీఆర్. వందరోజుల్లో హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయమన్నారు.
BRS Working President Sri @KTRBRS addressing the Media at Telangana Bhavan https://t.co/AaixhezLSE
— BRS Party (@BRSparty) January 3, 2024
కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ బండి సంజయ్ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే.. నిజామాబాద్, కరీంనగర్ లాంటి స్థానాల్లో ఆ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న అనుమానం కలుగుతోందన్నారు కేటీఆర్. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ అయ్యామన్నారు. తప్పుల నుంచి తప్పకుండా నేర్చుకుంటామని స్పష్టంచేశారు.