Telugu Global
Telangana

వచ్చే ఎన్నికల్లో వందకు వందశాతం మనమే గెలుస్తాం

ఏం కోల్పోయామో ప్రజలకు తెలిసింది : బీఆర్‌ఎస్‌ అధనేత కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో వందకు వందశాతం మనమే గెలుస్తాం
X

వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం మనమే గెలుస్తామని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌ లో పాలకుర్తి నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి, నటుడు రవితేజ బీఆర్ఎస్‌ లో చేరారు. కేసీఆర్‌ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలిచేది మనమేనని.. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. అన్ని జిల్లాల్లో జనమే ఈ విషయం చెప్తున్నారని అన్నారు. ''మనం అధికారంలోకి వచ్చాక కత్తులు తిప్పుతం.. వీన్ని లోపటేస్తం.. వాన్ని లోపటేస్తం అనం.. ప్రజలకు మంచి చేస్తాం.. ప్రభుత్వమంటే ప్రజలను కాపాడాలే కానీ గీ పంచాయితీలు కాదు.. మన పార్టీల తక్కువ మందిమి ఉన్నమా? రౌడీ పంచాయితీలు మనకు చెయ్యరాదా.. ఇంక నేను తిడితే వాళ్లు చచ్చిపోవాలే.. అది లెక్క కాదు కదా అదేం పద్ధతి.. అధికారంలో ఉన్నోళ్లు నిలబెట్టాలే.. నిర్మాణం చెయ్యాలే.. లాభం చెయ్యాలే.. కొందరిని పైకి తేవాలే.. ఈ కూలగొడుత.. అరెస్టు చేస్తా.. లోపలేస్తా.. ఇదేంది? పిచ్చిపిచ్చి మాటలు.. చెండాలమైన మాటలు.. పద్ధతేనా ఇది.. గవర్నమెంట్‌ లో ఉన్నోళ్లు మాట్లాడే మాటలేనా ఇవి.. గా పని చెయ్యడానికి గవర్నమెంట్‌ కావాల్నా? తిట్లు మనకు రావా? ఇయ్యాల మొదలు పెడితే రేపు గియ్యాల దాకా తిడుతం.. ఒక బాధ్యత ప్రజలు అప్పగించినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకోవాల్నో తీసుకోవాలే.. అంతే భరోసాతో ప్రజలకు సేవ చేయాలే..'' అన్నారు.

రాష్ట్రంలోని అట్టడుగున ఉన్న ప్రజలకు మేలు చేయాలనేది బీఆర్‌ఎస్‌ సంకల్పం అన్నారు. మనం దళితబంధు తెస్తే ఈ ప్రభుత్వం దానిని అటకెక్కించిందన్నారు. దళితబంధు అమలు చేసి దళితుల జీవితాలు బాగు చేయాలన్నారు. గిరిజన బంధు తీసుకురావాలని, వృత్తి పనులు చేసుకునే వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఎవరైతే పూర్తిగా దిగజారి ఉన్నరో వాళ్లను మంచిగ అయ్యెటట్టు చేస్తే సమాజంలోని అసమానతలు తగ్గుతాయన్నారు. దీర్ఘకాలిక లక్ష్యంతోనే దళితబంధు లాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో మనం పది శాతం హామీలిస్తే ప్రజలు అడగకుండానే 90 శాతం పనులు చేశామన్నారు. ఏ ఒక్కరు అడగకున్నా అనేక పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. రాష్ట్ర ఆదాయం ఎంత.. ఖర్చు ఎంత అనే లెక్కలు తీసుకొని అందరు బాగుపడాలని పని చేస్తామన్నారు. ఒక వ్యక్తి కోసమో, ఓట్ల కోసమో పథకాలు ప్రవేశపెట్టలేదన్నారు. బతుకలేని పరిస్థితుల్లో ఉన్నోళ్లు, నాదాన్‌ ఉన్నోళ్లకే కదా ప్రభుత్వం సాయం చేయాల్సింది అని ప్రశ్నించారు. చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయిందని.. ఆరు నెలల ముందు ఎలక్షన్ల లొల్లి ఉంటుందని.. అందరం కలిసి జాగ్రత్తగా పని చేసుకుందామని సూచించారు. ఈ ప్రభుత్వంలో ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ పై విశ్వాసంతో ఉన్నారని.. అందరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

First Published:  9 Nov 2024 6:07 PM IST
Next Story