రైతుబంధు ఎగ్గొట్టినందుకు రేపు బీఆర్‌ఎస్ నిరసన
అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని పిలుపు
వానాకాలం పంట సీజన్ లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టిందని, దీనికి నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఎకరానికి 15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి రైతులను కాంగ్రెస్ మోసం చేసిన తీరును ఎండగట్టాలని సూచించారు. వానాకాలం పంట సీజన్ కు రైతుభరోసా ఇవ్వలేమని మంత్రి చెప్పడం అంటే మోసం చేయడమేనని కేటీఆర్ మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పి రైతులకు రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రైతుబంధుకు రాం రాం చెప్తారని కేసీఆర్ ముందే హెచ్చరించారని, అవే మాటలను రేవంత్ రెడ్డి నిజం చేశారని అన్నారు. వానాకాలం పంట సీజన్ రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టి లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనంతో రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. కేబినెట్ సబ్ కమిటీల పేరుతో ఎగ్గొట్టాలని చూస్తే ప్రభుత్వం వీపులు రైతులు చింతపండు చేస్తారని హెచ్చరించారు. ఎద్దు ఏడ్చినా ఏవుసం.. రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదని, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తగులుతుందన్నారు. పేదల కుడుపుకొట్టే మూసీ ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు ఉంటాయి కానీ.. రైతుభరోసాకు పైసలు లేవా అని ప్రశ్నించారు. రైతులతో చెలగాటం ఆడితే మాడి మసి అవుతారన్నారు. రైతులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, రుణమాఫీ చేసే వరకు, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదన్నారు.