Telugu Global
Telangana

రేపు.. కేంద్రంలో బీఆర్ఎస్‌దే కీలక పాత్ర

కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రెండు జాతీయ పార్టీలకు షాక్​ ఇస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రజలు 12 నుంచి 14 సీట్లు ఇవ్వబోతున్నారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రేపు.. కేంద్రంలో బీఆర్ఎస్‌దే కీలక పాత్ర
X

లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్నారు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. ప్రాంతీయ పార్టీలదే పెత్తనం ఉండబోతోందన్నారు. రాబోయేరోజుల్లో కేంద్రంలోనూ బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పదవి రేసులో తాను కూడా ఉంటానని ఇప్పటికే స్పష్టం చేశారు కేసీఆర్. ప్రాంతీయ పార్టీల కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇదేమి ఆషామాషీగా చెప్పట్లేదని, తన సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివిధ వర్గాల నుంచి తీసుకున్న సమాచారాన్ని బట్టి చెబుతున్నానన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు కేసీఆర్. దక్షిణాదిలో పది సీట్లు కూడా రావని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, ఆ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రెండు జాతీయ పార్టీలకు షాక్​ ఇస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ప్రజలు 12 నుంచి 14 సీట్లు ఇవ్వబోతున్నారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గొప్ప ఫలితాలు..

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సైతం లోక్‌సభ ఎన్నికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ శ్రేణులు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ వెంట నడిచి కొట్లాడిన తీరు అద్భుతమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడటం ఆషామాషీ కాదన్నారు. ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివన్నారు ఎమ్మెల్యే హరీష్‌రావు. ఎంతో అంకిత భావంతో అభ్యర్థులను గెలిపించడానికి నిర్విరామంగా పనిచేసిన వాళ్లందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

First Published:  14 May 2024 4:24 AM GMT
Next Story