వరంగల్‌లో 16న బీఆర్ఎస్ భారీ సభ.. మహిళలే టార్గెట్‌గా మేనిఫెస్టో!
బీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో ఎప్పుడు సభ నిర్వహించినా భారీ సక్సెస్ అవుతుంది. సీఎం కేసీఆర్‌కు కూడా వరంగల్ ఒక సెంటిమెంట్ కావడంతో.. అక్కడే మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. 115 అసెంబ్లీ స్థానాలకు ఓకే సారి అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించిన సీఎం కేసీఆర్.. ఇక మేనిఫెస్టోతో మరోసారి అందరినీ ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ నెల 16న వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తెలంగాణ ఎన్నికలకు ఆ సభలోనే సమర శంఖారావం పూరించనున్నారు. అప్పటిలోగా ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో.. వరంగల్ సభను పూర్తిగా పార్టీ కార్యక్రమంగా సాగనున్నది.
బీఆర్ఎస్ పార్టీ వరంగల్‌లో ఎప్పుడు సభ నిర్వహించినా భారీ సక్సెస్ అవుతుంది. సీఎం కేసీఆర్‌కు కూడా వరంగల్ ఒక సెంటిమెంట్ కావడంతో.. అక్కడే మేనిఫెస్టోను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో మహిళలను ఆకట్టుకునే పథకాలను ప్రకటించింది. వాటికి మించి బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అద్భుతమైన పథకాలు ఉండబోతున్నట్లు మంత్రి హరీశ్ రావు ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇప్పటికే అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్లు, రైతు బంధు పథకాలను మరింత మెరుగు పరిచి ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాజా ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే 76 నియోజకవర్గాల్లో మెజార్టీగా ఉన్నారు. వారిని ఆకట్టుకుంటే తప్పకుండా గెలుపు సాధ్యం అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నది. దీనికి తోడుగా మహిళలే లక్ష్యంగా భారీ పథకాలు ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో మహిళల కోసం అమలు అవుతున్న పథకాలను ఇప్పటికే అధ్యయనం చేయించారు. అక్కడి కంటే మరింత మెరుగ్గా ఎలా అమలు చేయాలనే విషయాలపై కీలక నాయకులతో చర్చించారు. సీనియన్ నాయకుడు మధుసూదనాచారి, ఇతర నాయకుల సలహాలు సూచనల మేరకు మేనిఫెస్టో తయారు అవుతున్నట్లు తెలుస్తున్నది.
ఈ సారి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయేలా ఉండనుందని, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పథకాలు ఉంటాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. దసరా కానుకగా మేనిఫెస్టోను ప్రకటిస్తారని.. ఆ తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ పరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తున్నది. ప్రస్తుతం మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నదని.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడిన వెంటనే దానికి తుది మెరుగులు తిద్దుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.