శ్రీనివాస్ రెడ్డి సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
అమెరికాకు వెళ్లినా ఆయన యోగక్షేమాలను తెలుసుకుంటాం : మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ ఎమ్మెల్సీ, పార్టీ ఆఫీస్ సెక్రటరీ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని అమెరికా వెళ్తున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్ లో ఘనంగా వీడ్కోలు పలికారు. జలదృశ్యం నుంచి బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ వరకు 24 ఏళ్ల పాటు ఆయన బీఆర్‌ఎస్ పార్టీకి సేవలందించారని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి తన ఇన్నేళ్ల అనుభవాన్ని పుస్తకం రూపంలో తీసుకురావాలని కోరారు. ఆయన అమెరికాకు వెళ్లినా యోగక్షేమాలు ఎప్పటికీ తెలుసుకుంటూ ఉంటామని తెలిపారు. ఆయనకు అక్కడ ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చిన కేసీఆర్ కు, బీఆర్‌ఎస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి దంపతులను హరీశ్ రావు, మధుసూదనాచారి, జగదీశ్ రెడ్డి, పద్మారావు గౌడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి దంపతులకు హరీశ్ రావు స్వయంగా భోజనం వడ్డించారు. తెలంగాణ భవన్ పోర్టికో వరకు వారిద్దరిని వెంటబెట్టుకొని వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నాయకులు గొంగిడి సునీత ,దేవీప్రసాద్, దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమిళ్ల రాకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.