రెండు సీట్లు ఇస్తామంటున్న బీఆర్ఎస్.. పొత్తుపై పునరాలోచిస్తున్న వామపక్షాలు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం వామపక్షాల పొత్తుపై ఎలాంటి చర్చలు జరపలేదు.
అధికార బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిగా సన్నద్దం అవుతోంది. ప్రతిపక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. ఈ వారంలోనే తొలి జాబితాను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు సమాచాం. అయితే, ఎప్పటి నుంచో బీఆర్ఎస్‌తో పొత్తు కోసం సీపీఐ, సీపీఎం పార్టీలు ఎదురు చూస్తున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో వామపక్షాల మద్దతును సీఎం కేసీఆర్ కోరారు. ఆ నియోజకవర్గంలో వామపక్షాలకు బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో బీఆర్ఎస్ గెలుపులో ఉపయోగపడింది. అప్పుడే వామపక్షాలతో భవిష్యత్‌లో కూడా కలిసి నడుస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. వామపక్షాలు కూడా బీఆర్ఎస్ పార్టీతోనే తమ ఎన్నికల పొత్తు ఉంటుందని పలు మార్లు చెప్పాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం వామపక్షాల పొత్తుపై ఎలాంటి చర్చలు జరపలేదు.
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేయడానికి సిద్ధపడుతుండగా.. వామపక్షాలు ఇంకా పొత్తుపై చర్చల కోసం వేచి చూస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే భావిస్తున్నారు. కానీ, వాళ్లు అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది. సీపీఐ, సీపీఎంకు కలిపి రెండు సీట్లు ఇస్తామనే ఫీలర్లు బీఆర్ఎస్ వైపు నుంచి బయటకు వచ్చాయి. భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం, మునుగోడు టికెట్లను వామపక్షాలకు ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. అంతే కాకుండా ఎన్నికల అనంతరం రెండు పార్టీలకు రెండు ఎమ్మెల్సీల చొప్పున ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
వామపక్షాలు మాత్రం రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 10 సీట్లను ఆశిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకునేందుకు ఒక అవగాహనకు వచ్చాయి. బీఆర్ఎస్‌తో పొత్తు ఉన్నా.. లేకపోయినా 10 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. సీపీఐ పార్టీ కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, హుస్నాబాద్, వైరా సీట్లను.. సీసీఎం పార్టీ పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం, మధిర, ఇబ్రహీంపట్నం టికెట్లను ఆశిస్తున్నాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే టికెట్ల కోసం భారీగా పోటీ నెలకొన్నది. ఈ సందర్భంలో 10 సీట్లను పొత్తులో భాగంగా వామపక్షాలకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా లేనట్లు తెలుస్తున్నది.
వామపక్షాలు తమతో కలిసి నడవాలంటే ప్రస్తుతం రెండు టికెట్లు.. ఎన్నికల అనంతరం 4 ఎమ్మెల్సీ స్థానాలతో సరిపెట్టుకోవాలని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. సీపీఐ, సీపీఎం మాత్రం మొదటి నుంచి అడుగుతున్న 10 స్థానాలనే గట్టిగా కోరుతున్నాయి. ముఖ్యంగా కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు, పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ ఆఫర్ చేసిన వాటిలో ఈ రెండు సీట్లు లేకపోవడంతో వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసే వరకు వేచి చూడాలని.. ఆ తర్వాతే ఎన్నికల పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని వామపక్షాలు భావిస్తున్నాయి. కనీసం 10 టికెట్లు లేకపోతే పొత్తు పెట్టుకోవడం కూడా వృధానే అని ఒక వామపక్ష నాయకుడు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కనుక రెండు సీట్ల ఫార్ములాకే కట్టుబడి ఉంటే.. వామపక్షాలు ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.