మల్లారెడ్డిపై కేసు.. వైరల్ అవుతున్న హరీష్ వ్యాఖ్యలు
మల్లారెడ్డి కేసు వ్యవహారం బయటకు రాకముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కానీ మల్లారెడ్డిపై కేసు నమోదైన తర్వాత హరీష్ రావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ భిక్షపతి అనే వ్యక్తి శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మల్లారెడ్డిపై భూకబ్జాపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు.
మల్లారెడ్డి కేసు నేపథ్యంలో మరో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ లో కేసులు పెట్టి ఉంటే.. సగం మంది కాంగ్రెస్ నేతలు జైల్లో ఉండేవారని అన్నారు హరీష్ రావు. కష్టపడి సాధించిన తెలంగాణ.. కక్షలు, పగలతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోటే అభివృద్ధిపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదని అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మల్లారెడ్డి కేసు వ్యవహారం బయటకు రాకముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కానీ మల్లారెడ్డిపై కేసు నమోదైన తర్వాత హరీష్ రావు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన జరుగుతున్న వరుస ఘటనలు సంచలనంగా మారుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్ ని సీజ్ చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన ఈ మాల్ కి ఇంతవరకు అద్దె చెల్లించలేదని వారు చెబుతున్నారు. ఆ తర్వాత స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.20 కోట్ల రుణాన్ని చెల్లించాలని ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
జీవన్ రెడ్డి వ్యవహారం తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి కేసు సంచలనంగా మారింది. గతంలో కూడా మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు ఉన్నా.. ప్రభుత్వం మారిన వెంటనే కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులు ఇక్కడితో ఆగిపోతాయా..? మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు.. ఇలా నోటీసులు, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందా..? వేచి చూడాలి.