Telugu Global
Telangana

కాంగ్రెస్‌ పార్టీలో చీడ పురుగువు నువ్వు.. అసెంబ్లీలో మాటల యుద్ధం

అసలు కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పురుగువు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్‌ చేసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది నువ్వు అంటూ కడియం రెచ్చిపోయారు.

కాంగ్రెస్‌ పార్టీలో చీడ పురుగువు నువ్వు.. అసెంబ్లీలో మాటల యుద్ధం
X

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన విమర్శలకు సభలో సీఎం రేవంత్ రెడ్డి కౌంటరిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం వాడిన భాషపై బీఆర్ఎస్‌ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం తెలిపారు. "తెలంగాణ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఉండి నిండు సభలో మీరు సహనం కోల్పోయి వాడరాని భాష వాడారు. అది ఏమాత్రం కరెక్టు కాదు. ముఖ్యమంత్రి సంయమనం పాటించాలి. సీఎం పట్ల రాష్ట్రప్రజలకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగానే ముఖ్యమంత్రి భాష ఉండాలి తప్పితే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడినట్లు మాట్లాడితే బాగుండదు" అంటూ రేవంత్‌కు చురకలు అంటించారు కడియం శ్రీహరి.

అనంతరం తన పేరు తీసిన రాజగోపాల్‌రెడ్డికి కడియం శ్రీహరి కౌంటరిచ్చారు. "రాజగోపాల్‌రెడ్డి నా పేరు తీసుకుని మాట్లాడారు. నేను ఎవరినో చీట్ చేశానంటా, ఎవరినో మోసం చేశానంట. అసలు కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పురుగువు నువ్వు. కాంగ్రెస్ పార్టీని చీట్‌ చేసింది నువ్వు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది నువ్వు అంటూ కడియం రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోక్యం చోసుకున్నారు. సభలో అయినా, బయటైనా వాడరాని భాష ఎవరూ మాట్లాడకూడదన్నారు.

అనంతరం మైక్ అందుకున్న రాజగోపాల్‌రెడ్డి కడియంపై అసహనం వ్యక్తం చేశారు. " మీరు సీనియర్ నాయకుడు, మీరు నన్ను అలా అనొచ్చా?. మంత్రులు ఎవరు కావాలి, ఎవర్ని చేయాలి అనేది పార్టీ అంతర్గత విషయం. కానీ, బీఆర్ఎస్‌ వాళ్లు.. మీకు మంత్రి పదవి రాలేదు కదా, మిమ్మల్ని మంత్రి చేయలేదు కదా అని మమ్నల్ని రెచ్చగొట్టి పార్టీని చీల్చే కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్‌ వాళ్ల కడుపులో విషముంది. ఓడిపోయామని తట్టుకోలేకపోతున్నారు. మాలో మాకు గొడవలు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని చూస్తున్నారు. కానీ, అది జరగదు. మాకు పదవులు అవసరం లేదు. మేం కలిసికట్టుగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాం" అని బీఆర్ఎస్‌ సభ్యులకు కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి.

రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వాడుతున్న భాషకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతుండగా మాట్లాడేందుకు నిబంధనలు ఒప్పుకోవన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి హరీష్‌రావు, కేటీఆర్ ఆందోళనకు దిగారు. సభలో, బయట అంతటా ఆంక్షలేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో కింద కూర్చొని రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

First Published:  14 Feb 2024 6:19 PM IST
Next Story