Telugu Global
Telangana

తెలంగాణ అప్పులు.. బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలు

గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినా.. మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశారని, ఇప్పుడు వాటి ఊసే లేదని, కేవలం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తోందని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

తెలంగాణ అప్పులు.. బీఆర్ఎస్ ఘాటు వ్యాఖ్యలు
X

తెలంగాణలో 100రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొత్త పథకాల గురించి ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం ఇదీ అంటూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అప్పులు తెరపైకి వచ్చాయి. 105 రోజుల్లో రూ. 16,400 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయంటూ బీఆర్ఎస్ అకౌంట్ నుంచి ట్వీట్ వేశారు. కొత్త ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ ఖజానాలోకా..? లేక రేవంత్ జేబులోకా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు.


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు ట్వీట్..

BRSలో చేరిన తర్వాత కాంగ్రెస్ పై RSP తొలి ట్వీట్ వేశారు. కాంగ్రెస్ అప్పుల్ని ఆయన టార్గెట్ చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్లు అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలు.. ఈ నాలుగు నెలల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనికి అదనంగా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు రెండింతలు ఉంటాయని RSP అంచనా వేశారు. వాటిని బడ్జెట్లలో చూపించరని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినా.. కనీసం మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశారని, ఇప్పుడు వాటి ఊసే లేదని, కేవలం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తోందని మండిపడ్డారు.


శ్వేతపత్రం..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు శ్వేత పత్రాల హడావిడి నడిచింది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా, గత ప్రభుత్వాన్ని నిందించేలా శ్వేత పత్రాలు రెడీ చేశారు అమాత్యులు. ఇప్పుడు కొత్త అప్పులపై కూడా శ్వేత పత్రం రిలీజ్ చేయాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ఏదీ దాచకుండా శ్వేత పత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

First Published:  20 March 2024 11:59 AM GMT
Next Story