Telugu Global
Telangana

BRS - ADR | ఆదాయంలో బీఆర్ఎస్ టాప్.. ఖర్చులో తృణమూల్ ఫస్ట్.. ప్రాంతీయ పార్టీల ఆదాయంపై ఏడీఆర్

మొత్తం 39 పార్టీల ఆదాయం రూ.1,740.48 కోట్లని ఏడీఆర్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 31 లోపు వార్షిక ఆడిటింగ్ ఖాతాల వివరాలను తెలపాలని పార్టీలను ఆదేశించింది.

BRS - ADR | ఆదాయంలో బీఆర్ఎస్ టాప్.. ఖర్చులో తృణమూల్ ఫస్ట్.. ప్రాంతీయ పార్టీల ఆదాయంపై ఏడీఆర్
X

BRS - ADR | దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అత్యధిక ఆదాయం గల పార్టీగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో బీఆర్ఎస్ ఆదాయం రూ.737.67 కోట్లు అని, ప్రాంతీయ పార్టీల ఆదాయంలో 42.38 శాతం అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఖర్చు చేసిన టాప్-5 పార్టీల్లో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ రూ.181.18 కోట్లు (37.66 శాతం) ఖర్చు చేసింది. తర్వాతీ స్థానంలో ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.79.32 కోట్లు (16.49 శాతం), బీఆర్ఎస్ రూ.57.47 కోట్లు (11.94 శాతం), డీఎంకే రూ.52.62 కోట్లు (10.94 శాతం), సమాజ్ వాదీ పార్టీ రూ.31.41 కోట్లు (6.53 శాతం) నిధులు ఖర్చు చేశాయని ఏడీఆర్ వివరించింది.

గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశంలోని 57 ప్రాంతీయ పార్టీల్లో 39 పార్టీల ఆదాయ వ్యయాలను ఏడీఆర్ బయట పెట్టింది. బీఆర్ఎస్ తర్వాత టీఎంఎస్ అత్యధికంగా రూ.333.45 కోట్లు (19.16 శాతం), డీఎంకే రూ.214.35 కోట్లు (12.32 శాతం) ఆదాయం సంపాదించాయని ఏడీఆర్ పేర్కొంది. 39 ప్రాంతీయ పార్టీల్లో టాప్-5 పార్టీల ఆదాయం రూ.1,541.32 కోట్లు (88.56 శాతం) ఉంటుంది. మొత్తం 39 పార్టీల ఆదాయం రూ.1,740.48 కోట్లని ఏడీఆర్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 31 లోపు వార్షిక ఆడిటింగ్ ఖాతాల వివరాలను తెలపాలని పార్టీలను ఆదేశించింది. వాటిలో 16 పార్టీలు మాత్రమే సమయంలోపు వివరాలు వెల్లడించాయి. 23 పార్టీలు మూడు రోజుల నుంచి 150 రోజులు ఆలస్యంగా సమర్పించాయి.

ఇప్పటికీ ప్రముఖ ప్రాంతీయ పార్టీలుగా ఉన్న శివసేన, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన (యూబీటీ) వార్షిక ఆదాయ వ్యయాల వివరాలు ఈసీలో లభించలేదని ఏడీఆర్ తెలిపింది. మొత్తం 19 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం ఖర్చు చేయలేదని తెలిపాయి. బీఆర్ఎస్ వద్ద రూ.680.20 కోట్లు, బిజూ జనతాదళ్ రూ.171.06, డీఎంకే వద్ద రూ.161.72 కోట్ల ఆదాయం ఖర్చు చేయలేదని ఏడీఆర్ తెలిపింది. 20 పార్టీలు మాత్రం ఆదాయాన్ని మించి ఖర్చు చేశారు. వాటిలో జేడీఎస్ ఆదాయాన్ని మించి రూ.490.43 కోట్లు ఖర్చు చేసింది. తమ మొత్తం ఆదాయంలో స్వచ్ఛంద విరాళాలు, ఎలక్ట్రోరల్ బాండ్లు తదితర రూపాల్లో వచ్చిన ఆదాయం రూ.1,522.46 కోట్లు (87.47 శాతం) ఉందని రాజకీయ పార్టీలు తెలిపాయి. ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా రూ.1,285.83 కోట్ల నిధులు సేకరించినట్లు రాజకీయ పార్టీలు తెలిపాయి. అయితే ఎనిమిది ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించినట్లు తెలిపాయి.

First Published:  20 July 2024 12:11 PM IST
Next Story