కేసీఆర్ భరోసా పేరుతో ఇంటింటికి బీఆర్ఎస్!
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది.. ఏం సాధించింది, భవిష్యత్తు ప్రణాళికలపై బీఆర్ఎస్ కార్యకర్తలు వివరించనున్నారు.
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునే చర్యలు, అమలు చేసే పథకాలను కేసీఆర్ భరోసా పేరుతో ఇంటింటికి తీసుకెళ్లాలనే ప్లాన్ చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసింది.. ఏం సాధించింది, భవిష్యత్తు ప్రణాళికలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు వివరించనున్నారు. పార్టీ మేనిఫెస్టోపైనా అవగాహన కల్పిస్తారు. పార్టీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని ప్రజలకు వివరిస్తారు. ఈ మేరకు పార్టీ శ్రేణులను ఆదేశించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బుధవారం పార్టీ కార్యకర్తలతో తెలంగాణ భవన్‌లో మాట్లాడిన కేటీఆర్..బీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగుబంధమని వివరించారు. గ్రామాల్లో అడిగితే..బీఆర్ఎస్, టీఆర్ఎస్ కాదు తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటారన్నారు. ఇతర పార్టీలకు అలాంటి అనుబంధం లేదని చెప్పారు. కర్ణాటకలో తెలంగాణ కంటే మెరుగైన పాలన ఉంటే చూపించాలని AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు సవాల్ విసిరారు కేటీఆర్.