Telugu Global
Telangana

నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం

ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరుతుంది.

నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం
X

మేడిగడ్డ బ్యారేజ్ పై వస్తున్న విమర్శలన్నీ పటాపంచలయ్యాయని, భారీ వర్షాలకు కాళేశ్వరం సత్తా ఏంటో మరోసారి తెలిసొచ్చిందని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మేడిగడ్డను సందర్శిస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఈరోజు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డకు వెళ్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు బయలుదేరుతుంది.


ప్రభుత్వంపై ఒత్తిడి..

కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు వెళ్తుందని చెప్పారు నేతలు. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గురు, శుక్రవారాల్లో కన్నెపల్లి పంప్‌హౌస్‌, మేడిగడ్డ బ్యారేజ్‌ను నేతలు పరిశీలిస్తారు. మొదటగా కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. ఈరోజు రాత్రి రామగుండంలో బీఆర్‌ఎస్ నేతల బృందం బస చేస్తుంది. రేపు(శుక్రవారం) కన్నెపల్లి పంపు హౌజ్‌ను సందర్శించి, అక్కడినుంచి మేడిగడ్డకు బయలుదేరుతారు. కాళేశ్వరం పర్యటన ముగిసిన తర్వాత నేతలంతా తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ వ్యవహారాన్ని కాంగ్రెస్ బాగా హైలైట్ చేసింది. బ్యారేజ్ లోని పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, నాసిరకంగా కట్టారని, ఇంజినీర్ల ప్లాన్ పక్కనపెట్టి సొంత తెలివి ఉపయోగించారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మరమ్మతులు చేయకపోతే ప్రాజెక్ట్ కొట్టుకుపోతుందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కానీ భారీ వర్షాలను, వరదలను తట్టుకుని మేడిగడ్డ నిలబడిందని, కాంగ్రెస్ అసత్య ఆరోపణలకు ఇదే సమాధానం అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

First Published:  25 July 2024 2:34 AM GMT
Next Story