బీఆర్ఎస్ టార్గెట్ 100 సీట్లు.. ఆ 3 బీజేపీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్
100 అసెంబ్లీ సీట్లను సాధించడం టార్గెట్ అయితే.. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాలను బీఆర్ఎస్ ఖాతాలో పడేలా చేయడం మరో లక్ష్యంగా సీఎం కేసీఆర్ పెట్టినట్లు తెలుస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో 100 సీట్లు సాధించాలని బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. త్వరలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకోనున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల పైనే దృష్టి పెట్టే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలం గురించి అనుమానించాల్సిన అవసరమే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలమైన క్యాడర్ పార్టీకి ఉన్నది. ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించడం కష్టమేమీ కాదు. కానీ, 100 అసెంబ్లీ సీట్లను సాధించాలంటే కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకుల వరకు వారి బాధ్యతలను పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వర్తించాలని కేసీఆర్ చెబుతున్నారు. 9 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల.. ప్రజల్లో కాస్తో, కూస్తో అసంతృప్తి ఉండటం సహజమని.. అయితే దాన్ని అధిగమించేలా ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల్లో ఉండాలని, ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే చర్యలు తీసుకోవాలని సీఎం సూచిస్తున్నారు.
100 అసెంబ్లీ సీట్లను సాధించడం టార్గెట్ అయితే.. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు నియోజకవర్గాలను బీఆర్ఎస్ ఖాతాలో పడేలా చేయడం మరో లక్ష్యంగా కేసీఆర్ పెట్టినట్లు తెలుస్తున్నది. దుబ్బాక, హుజూరాబాద్, గోషామహల్ సీట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడానికి వ్యూహం సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీకి నుంచి రాజాసింగ్ ఉన్నారు. అతని వల్ల సొంత పార్టీ బీజేపీకే చిక్కులు వస్తున్నాయి. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హైదరాబాద్‌లో శాంతి, భద్రతల సమస్య వచ్చింది.
తరచూ రాజా సింగ్ చేసే వ్యాఖ్యలు నగరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. అందుకే ఈసారి రాజాసింగ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదని బీఆర్ఎస్ భావిస్తోంది. గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జిగా నంద కిషోర్ వ్యాస్‌ను నియమించారు. రాబోయే ఎన్నికల్లో ఆయనే పార్టీ తరపున బరిలో ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. రాజాసింగ్ వల్ల కలుగుతున్న సమస్యలను, బీఆర్ఎస్ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కేవలం 6,312 ఓట్లు మాత్రమే సాధించింది. అయితే 2018కి వచ్చే సరికి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 44,120కి పెరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు వల్ల రెండో స్థానానికి పరిమితం అయ్యింది. అయితే ఈసారి మాత్రం ఓట్ల శాతాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రాజాసింగ్ వైఖరి పట్ల నియోజకవర్గం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇది తప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థికి కలసి వస్తుందని చెబుతున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. అక్కడ రాజేందర్ విజయం కేవలం వ్యక్తిగతమేనని, కానీ అది బీజేపీ విజయంగా చెప్పుకున్నారనేది బహిరంగ రహస్యమే. కాగా, రాజేందర్ గెలిచిన తర్వాత అతను నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. పైగా ఆయనకు సొంత పార్టీ నుంచే అసమ్మతి మొదలైంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో రాజేందర్‌కు పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.
రాష్ట్రంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు మొదట హుజూరాబాద్‌లోనే అమలు చేశారు. ఇప్పుడు ఆ పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. ఈసారి తప్పకుండా ఈటలపై గెలిచి తీరతానని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాకను కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. రఘునందన్ రావుకు పోటీగా కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి.. దుబ్బాకపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.