Telugu Global
Telangana

వచ్చే ఎన్నికల్లో వందసీట్లు మనవే -కేసీఆర్

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదని, మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలనేది ప్రాధాన్యతాంశం అని చెప్పారు సీఎం కేసీఆర్.

Telangana Assembly Elections 2023: BRS target 100 assembly seats says KCR
X

వచ్చే ఎన్నికల్లో వందసీట్లు మనవే -కేసీఆర్

రాబోయే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచామని గుర్తు చేశారు. ఈసారి కచ్చితంగా 100కుపైగా సీట్లు గెలుస్తామన్నారు. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని చెప్పిన ఆయన.. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో నాయకులు మమేకం కావాలన్నారు. తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్‌ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

నాట్ బై ఛాన్స్.. బై ఛాయిస్

ఎలక్షన్ షుడ్ బి నాట్ బై ఛాన్స్.. బట్ బై ఛాయిస్.. అని అన్నారు సీఎం కేసీఆర్. దాహం వేసినప్పుడే బావి తవ్వుతామంటే కుదరదని, అది నేటి రాజకీయాలకు సరిపోదని చెప్పారు. బీఆర్ఎస్‌ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా భవిష్యత్తులో చేపడతామన్నారు కేసీఆర్. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ ను సైతం నడపొచ్చని చెప్పారు.


అధికారంలోకి ఎలాగూ వస్తాం, కానీ..

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదని, మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలనేది ప్రాధాన్యతాంశం అని చెప్పారు సీఎం కేసీఆర్. కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని నేరుగా చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంలో నాయకులు ముందుండాలన్నారు. క్యాడర్‌లో అసంతృప్తి తగ్గించే చర్యలు చేపట్టండని నాయకులకు సూచించారు. ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోండి, నిత్యం ప్రజల్లో ఉండండి అంటూ ఉపదేశమిచ్చారు.

First Published:  27 April 2023 4:01 PM IST
Next Story