బీసీ సభకు బీఆర్ఎస్ మద్దతు.. కవితతో కృష్ణయ్య భేటీ
బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తున్నట్టు తెలిపారు ఎంపీ ఆర్.కృష్ణయ్య. తాము చేపట్టే ఉద్యమానికి ఎమ్మెల్సీ కవిత.. తన సంపూర్ణ సహకారం, మద్దతును ప్రకటించారని చెప్పారు.
ఈనెల 26న జల విహార్ లో బీసీ సంఘాలన్నీ ఐకమత్యంగా భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు ప్రకటించారు ఎమ్మెల్సీ కవిత. బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ ప్రాంత బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారామె. బీసీ సభకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యతో ఆమె పలు విషయాలు చర్చించారు.
చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు కులగణన చేపట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 26న బీసీ సంఘాలు హైదరాబాద్ వేదికగా సమావేశం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఎమ్మెల్సీ కవితతో కూడా ఆయన సమావేశమయ్యారు. బీసీ సమస్యలపై చర్చించారు.
బీసీ ఉద్యమానికి తెలంగాణ నుంచే శంఖారావం పూరిస్తున్నట్టు తెలిపారు ఎంపీ ఆర్.కృష్ణయ్య. తాము చేపట్టే ఉద్యమానికి ఎమ్మెల్సీ కవిత.. తన సంపూర్ణ సహకారం, మద్దతును ప్రకటించారని చెప్పారు. దశాబ్దాలుగా ఎదురు చూసిన మహిళా బిల్లు కోసం కవిత చేసిన పోరాటం ఫలించిందని, అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు కవిత. బీసీలు ఆర్థికంగా బలపడాలన్న ఆలోచనతో బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. బీసీ సభకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.