Telugu Global
Telangana

నమ్మక ద్రోహులకు బుద్ధి చెప్పాలి.. పార్లమెంట్ పోరులో బీఆర్ఎస్ ప్రచారం

రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, ఆయన ఎందుకు కాంగ్రెస్ లో చేరారో తెలియదని అన్నారు మాజీ మంత్రి సబిత. బీఆర్ఎస్ ను వీడిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.

నమ్మక ద్రోహులకు బుద్ధి చెప్పాలి.. పార్లమెంట్ పోరులో బీఆర్ఎస్ ప్రచారం
X

తెలంగాణలో ఈసారి లోక్ సభ ఎన్నికలు చాలా ప్రత్యేకం. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈదఫా జంపింగ్ లు చోటు చేసుకున్నాయి. జంపింగ్ నేతలంతా ఈసారి కట్టకట్టుకుని ఓడిపోతారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. నమ్మకద్రోహులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ప్రచారం మొదలు పెట్టిన నేతలు.. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి, కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయబోతున్న రంజిత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞనేశ్వర్, ఎమ్మెల్సీ సురభి వాణి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చేవెళ్ల పరిధిలో గత రెండు ఎన్నికల్లో జరిగిన పరిణామాలను వివరించారు మాజీ మంత్రి సబిత. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కేసీఆర్. 2019నాటికి కొండా కాంగ్రెస్ లోకి వెళ్లారు, అప్పుడు బీఆర్ఎస్ రంజిత్ రెడ్డిని తెరపైకి తెచ్చింది. అప్పటి వరకు చేవెళ్లకు పరిచయం లేని రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టి గెలిపించుకున్నారు కేసీఆర్. ఈసారి రంజిత్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్ కి టికెట్ ఇచ్చారు. గత అనుభవాలను గమనిస్తే ఈసారి కాసాని విజయం ఖాయమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచి ఓడిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిలాగే, రంజిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని దుయ్యబట్టారు.

రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, ఆయన ఎందుకు కాంగ్రెస్ లో చేరారో తెలియదని అన్నారు మాజీ మంత్రి సబిత. బీఆర్ఎస్ ను వీడిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

First Published:  23 March 2024 8:56 PM IST
Next Story