ఉద్యమ ఖిల్లా ఓరుగల్లులో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ
ఏప్రిల్ 27న అట్టహాసంగా నిర్వహణ.. లక్షలాది మందితో సభకు ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి) ఏర్పడి 25 ఏళ్లు అవుతోన్న సందర్భంగా ఉద్యమ ఖిల్లా వరంగల్ వేదికగా పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. లక్షలాది మందితో ఈ సభకు ఏర్పాట్లు చేయాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, ప్రభుత్వ వైఫల్యాలు సహా అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ''తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచీ కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీయే ఈ సమాజానికి రక్షణ కవచం అన్న విషయం పద్నాలుగు నెల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి అనిశ్చితే నిదర్శనం.. బీఆర్ఎ ఆవిర్భవించి 27 ఏప్రిల్ తేదీకి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకలను వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిద్దాం.. వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభా వేదిక స్థలాన్ని నిర్ణయించండి..'' అని ఆదేశించారు.
దశాబ్దాల పాటు పోరాటాలు నడిపి ఎన్నో త్యాగాలతో తెలంగాణను సాధించుకున్నామని, అనంతరం పదేండ్ల పాటు ఎంతో అప్రమత్తతో పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. అంతటి గొప్ప ప్రగతిని సాధించిన తెలంగాణ సమాజం ఇవ్వాల కష్టాల్లో ఉందన్నారు. ఈ సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవ వేడుకలు, కేవలం బీఆర్ఎస్ పార్టీకే పరిమితం కాదని యావత్ తెలంగాణ సమాజానికి అందులో భాగస్వామ్యం ఉంటుందన్నారు. "బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్థిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ.. ప్రజలు బీఆర్ఎస్ ను తమ సొంత ఇంటి పార్టీ గా భావిస్తారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారెంటీలను, అనేక వాగ్దానాలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపాన్ని తెలుసుకున్నారు.. ఇక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు..'' అన్నారు.
పార్టీ రజతోత్సవ సభ విజయవంతానికి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, అందుకోసం త్వరలోనే కమిటీలు వేయాలని అన్నారు. వరంగల్ బహిరంగ సభ అనంతరం పార్టీనీ గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్ట పరుస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామని.. కొత్త కమిటీల ఏర్పాటు తర్వాత పార్టీ ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైనా సమావేశంలో చర్చించారు. పార్టీకి గతంలో ఎదురైన ఒడిదుడుకుల అనుభవాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకుంటూ భవిష్యత్ కు బాటలు వేసేలా కార్యచరణ సిద్ధం చేసుకుందామని ప్రకటించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మోదటి నుంచి అవి తెలంగాణకు వ్యతిరేకంగానే పని చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకుంటూనే దేశ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. తెలంగాణ కోసం గళమెత్తే బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో లేకపోవడంతో రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లుతుందన్నారు. ఎనిమిది గంటలకు పైగా సమావేశంలో నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ ఎంపీలు లేకపోవడంతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలన్నారు. ప్రతి ఒక్క నాయకుడు పార్టీ రజతోత్సవ సభ విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.