Telugu Global
Telangana

మైనంపల్లికి ప్రత్యామ్నాయం.. తెరపైకి ఇద్దరి పేర్లు

అనధికారికంగా బీఆర్ఎస్ నేతలు ఆయన్ను దూరం పెట్టారు, అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే మైనంపల్లి తనకు తానే బయటకు వెళ్లిపోయే వరకు బీఆర్ఎస్ వేచి చూసే ధోరణిలో ఉంది.

మైనంపల్లికి ప్రత్యామ్నాయం.. తెరపైకి ఇద్దరి పేర్లు
X

బీఆర్ఎస్ లో మైనంపల్లి ఎపిసోడ్ కి ఈరోజు మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజ్ గిరి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేసినా, పార్టీకి నష్టం చేకూర్చేలా పదే పదే మాట్లాడారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. ఈ దశలో ఆయన్ను ఇక ఉపేక్షించరని తేలిపోయింది. మెదక్ లో బీఆర్ఎస్ శ్రేణులే మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆందోళన చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన్ను తిట్టని నోరు లేదు. అనధికారికంగా బీఆర్ఎస్ నేతలు ఆయన్ను దూరం పెట్టారు, అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అయితే మైనంపల్లి తనకు తానే బయటకు వెళ్లిపోయే వరకు బీఆర్ఎస్ వేచి చూసే ధోరణిలో ఉంది.

ప్రత్యామ్నాయం ఎవరు..?

మైనంపల్లిపై వేటు వేస్తే ఆ స్థానంలో మల్కాజ్ గిరినుంచి బీఆర్ఎస్ తరపున పోటీచేసే అభ్యర్థులపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. శాసన మండలి సభ్యుడు శంభీపూర్‌ రాజు, బీఆర్ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంటు ఇన్‌ చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత భర్త మోతె శోభన్‌ రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేరు కూడా వినిపించడం విశేషం. మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చే హామీతో ఆయన్ను తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆకుల రాజేందర్ కి టికెట్ ఇస్తే.. ముదిరాజ్ లకు కూడా న్యాయం చేసినట్టవుతుందని, అందుకే ఆయన పేరు తెరపైకి వచ్చిందని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ ఆలోచన ఏంటనేది మాత్రం బయటకు రాలేదు.

కాంగ్రెస్ గేలం..

మరోవైపు బీఆర్ఎస్ అసంతృప్తులందరికీ కండువాలు కప్పేస్తున్న కాంగ్రెస్, మైనంపల్లికి కూడా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన తిరుమలలో ఉండగానే కాంగ్రెస్ నుంచి ఫోన్లు వెళ్లాయి. తండ్రీకొడుకులిద్దరికీ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ మంతనాలు సాగిస్తోందట. మల్కాజ్ గిరిలో మైనంపల్లి, మెదక్ లో ఆయన తనయుడికి టికెట్లు కేటాయిస్తామనే హామీతో ఆయన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు.

*

First Published:  23 Aug 2023 6:50 AM IST
Next Story