మహారాష్ట్రలో లో బీఆర్ఎస్ బహిరంగ సభకు ఏర్పాట్లు..
నాందేడ్ సభలో కేవలం బీఆర్ఎస్ పరిచయమే కాదు, బలప్రదర్శన కూడా జరగాలని భావిస్తున్నారట. భారీగా చేరికలకోసం కృషి చేస్తున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ అద్భుత విజయం తర్వాత మహారాష్ట్రలో మలి సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 29 న సభ నిర్వహించాలనుకున్నా.. ఎన్నికల కోడ్ కారణంగా దాన్ని ఫిబ్రవరి-5కి వాయిదా వేశారు. మహారాష్ట్రలో శాసన మండలి ఎన్నికలు ఫిబ్రవరి-2తో పూర్తవుతుండటంతో.. ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ లో నాందేడ్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి సభలాగే మలి సభను కూడా భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటున్నారు.
భారత్ రాష్ట్ర సమితి విస్తరణలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ లో బహిరంగ సభ జరగాల్సి ఉంది. ఇటు మహారాష్ట్రలోని నాందేడ్ లో ఫిబ్రవరి-5న బహిరంగ సభకు మహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సభలో కూడా జాతీయ నాయకులు పాల్గొంటారని తెలుస్తోంది. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ సహా మొత్తం నాలుగు రాష్ట్రాల సీఎంలు వేదికపై ఉన్నారు. నాందేడ్ సభలో కూడా ఆ స్థాయిలో ఆకర్షణ ఉండేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
చేరికలతో హడావిడి..
నాందేడ్ సభలో కేవలం బీఆర్ఎస్ పరిచయమే కాదు, బలప్రదర్శన కూడా జరగాలని భావిస్తున్నారట. భారీగా చేరికలకోసం కృషి చేస్తున్నారు. జనాకర్షణ కలిగిన నేతలు, రైతు సంఘాల నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రకు బీఆర్ఎస్ ఇన్ చార్జ్ ని కూడా అదే వేదికపై ప్రకటిస్తారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. మహారాష్ట్రకు చెందిన కొంతమంది నేతలతో కేసీఆర్ ప్రగతి భవన్ లో మూడు రోజులుగా సమావేశం అవుతున్నారు. సభ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.
సభ నిర్వహణ ఏర్పాట్లు, చేరికలు, ఆహ్వానితులపై ఒకటి రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుంది. సభ ఏర్పాట్లకోసం ఈనెలలోనే సీఎం కేసీఆర్ నాందేడ్ వెళ్తారు. అక్కడి గురుద్వారాను ఆయన సందర్శిస్తారు. మహారాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ కి అప్పగించారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలు, నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేయబోతున్నారు.