Telugu Global
Telangana

వ్యవ'సాయం'.. రేవంత్ కి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత

రేవంత్ చెప్పిన లెక్క ప్రకారం మూడెకరాలున్న రైతు ఏడాదికి ఇప్పుడు 15వేల రూపాయలు అందుకుంటున్నారు. రేపు కాంగ్రెస్ వచ్చినా వారికి దక్కేది 15వేలే. అంటే అక్కడ కాంగ్రెస్ గొప్ప ఏముంది..? బీఆర్ఎస్ ని విమర్శించాలనే ఉద్దేశం మినహా రేవంత్ మాటల్లో పస ఏది..?

వ్యవసాయం.. రేవంత్ కి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత
X

తెలంగాణలో రైతుబంధు సూపర్ హిట్. దీన్ని కాపీకొడుతూ కేంద్రం కూడా రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది, ఇతర రాష్ట్రాలు కూడా రైతుల కోసం ప్రవేశపెట్టే పథకాలన్నిటికీ రైతుబంధు స్ఫూర్తి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రైతుబంధు స్ఫూర్తితో 'రైతు భరోసా'ని తన ఆరు గ్యారెంటీల్లో ఒకటిగా ప్రకటించింది. అయితే ఈ రైతు భరోసా కోసం తయారు చేసిన మార్గనిర్దేశకాలు వేరు, రేవంత్ రెడ్డి బయట చేస్తున్న వ్యాఖ్యానాలు వేరు. వ్యవ'సాయం'పై కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

రేవంత్ ఏమంటున్నారు..?

3 గంటల విద్యుత్ సరఫరాను సమర్థించుకునే క్రమంలో రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు. ఒక ఎకరాకు సాగునీరు పారాలంటే 10 హెచ్పీ మోటర్ గంటసేపు వేస్తే సరిపోతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉన్న 58 లక్షల కమతాల్లో.. 98శాతం మంది రైతులకు ఒకటి నుంచి మూడెకరాల లోపు పొలం మాత్రమే ఉందని, అంటే.. మూడు నుంచి నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తే పొలాలన్నిటిలో సమృద్ధిగా నీరు పారుతుందనేది రేవంత్ వాదన. ఈ వాదన బాగానే ఉంది. అదే సమయంలో రైతుబంధుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు ఈ మాటలతోనే సమాధానం దొరికినట్టయింది.

బిచ్చమేస్తున్నట్టా..?

ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు ద్వారా ప్రతి రైతుకి ఎకరాకి 5వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. 5వేల రూపాయల ఆర్థిక సాయం తక్కువ అని, రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం బిచ్చమేస్తుందా..? అని విమర్శించారు రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే రైతుకి ఏడాదికి 15వేల రూపాయలు ఇస్తామని ఘనంగా చెప్పారు. రేవంత్ చెప్పిన లెక్క ప్రకారం మూడెకరాలున్న రైతు ఏడాదికి ఇప్పుడు 15వేల రూపాయలు అందుకుంటున్నారు. రేపు కాంగ్రెస్ వచ్చినా వారికి దక్కేది 15వేలే. అంటే అక్కడ కాంగ్రెస్ గొప్ప ఏముంది..? బీఆర్ఎస్ ని విమర్శించాలనే ఉద్దేశం మినహా రేవంత్ మాటల్లో పస ఏది..? ఎక్కువ ఎకరాలున్న భూస్వాములకు రైతుబంధు సాయం అవసరమా అనే విమర్శలకు కూడా రేవంత్ మాటల్లోనే సమాధానం ఉంది. 98 శాతం కమతాలు చిన్నవే అయినప్పుడు ఇక రైతుబంధు దుబారా అయ్యే సమస్యే లేదు.

రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు..

కాంగ్రెస్ ప్రకటించిన రైతుభరోసాలో కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు యజమానులుగానే ఉన్నారు. వారంతా వారి పొలంలో వారే పనిచేసుకుంటుంటారు. మరి ఇక్కడ వ్యవసాయ కూలీలకు ఇచ్చే సాయాన్ని ఎలా లెక్కకడతారు. తన పొలంలో తాను పనిచేసుకునే రైతుకి కూడా వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12వేల రూపాయల సాయం అందుతుందా..? అనేదే ప్రశ్నార్థకం.

కేవలం రైతుబంధుని కాపీకొట్టి, రైతు భరోసా అనే పథకాన్ని ప్రకటించింది కాంగ్రెస్. ఏడాదికి రూ.15వేలు అని గొప్పలు చెప్పుకుంది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేస్తామంటోంది. కానీ ఇదంతా ఇప్పటికే రైతుబంధుతో సాధ్యపడిన వాస్తవం. పథకాన్ని కాపీకొట్టారే కానీ, సాధ్యాసాధ్యాలపై వారికే సరైన అవగాహన లేదనే విషయం ఇప్పుడు రేవంత్ మాటలతో స్పష్టంగా తెలుస్తోంది.


First Published:  11 Nov 2023 9:37 AM GMT
Next Story