Telugu Global
Telangana

నేడు బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం.. కీలక తీర్మానాలు చేయనున్న పార్టీ

తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏళ్లలో సాధించిన విజయాలు, కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలపై తీర్మానాలు ఉండనున్నాయి.

నేడు బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం.. కీలక తీర్మానాలు చేయనున్న పార్టీ
X

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ తెలంగాణ భవన్‌లో ప్రతినిధుల సమావేశం జరుగనున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 279 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కీలకమైన తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ ప్రభుత్వం గత 9 ఏళ్లలో సాధించిన విజయాలు, కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలపై తీర్మానాలు ఉండనున్నాయి. ముఖ్యంగా తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాల్లో సాధించిన అభివృద్ధి.. అమలు అవుతున్న పథకాలు, ఇతర రంగాల్లో సాధించిన విజయాలపై తీర్మానం చేయనున్నారు. అలాగే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్రపై కూడా కీలక తీర్మానం ఉండనున్నది. రాజకీయ తీర్మానాలతో పాటు పార్టీ పరిపాలనా తీర్మానాలు కూడా ఉండే అవకాశం ఉంది.

రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు పథకం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం గురువారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజకీయ పరిస్థితులపై, దేశంలోని కీలక విషయాలపై పార్టీ తీర్మానాలు చేస్తుందని ఆయన చెప్పారు.

సాధారణంగా 3 వేల నుంచి 4 వేల మంది ప్రతినిధులతో ప్లీనరీని నిర్వహించే వాళ్లం. కానీ ఈ సారి పార్టీ ప్రతీ నియోజకవర్గంలో మినీ ప్లీనరీలను 25న నిర్వహించింది. అక్కడే నియోజకవర్గాల స్థాయిలో అనేక తీర్మానాలు పార్టీ నాయకులు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున్న.. పార్టీ కార్యకర్తలను సమాయాత్తం చేసేందుకు ఈ మినీ ప్లీనరీలు ఉపయోగపడ్డాయని కేటీఆర్ చెప్పారు. జూన్ తర్వాత నియోజకవర్గాల వారీగా విద్యార్థులు, యువత కోసం ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. పార్టీని ఎన్నికల కోసం సిద్ధం చేయడానికి గత కొన్ని రోజులుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, ప్లీనరీలు ఉపయోగపడ్డాయని చెప్పారు. మేడే వేడుకలు కూడా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు.

First Published:  27 April 2023 7:31 AM IST
Next Story