Telugu Global
Telangana

ఒకరిద్దరు పార్టీ మారితే నష్టం లేదు.. బీఆర్ఎస్ రియాక్షన్

ఐదేళ్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మళ్లీ తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఒకరిద్దరు పార్టీ మారితే నష్టం లేదు.. బీఆర్ఎస్ రియాక్షన్
X

పోచారం శ్రీనివాస రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా ఉండగానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీఆర్ఎస్ కి షాకింగ్ అనే చెప్పాలి. అయితే ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన కేసీఆర్ కి కానీ, బీఆర్ఎస్ కి కానీ నష్టమేమీ లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీకి కార్యకర్తల బలం మెండుగా ఉందని చెబుతున్నారు.


ఐదేళ్ల తర్వాత కేసీఆరే సీఎం..

ఐదేళ్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మళ్లీ తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని, పార్టీ మూసేస్తారని చెప్పే వారికి సిగ్గులేదన్నారు. సిగ్గు, లజ్జ లేకుండా కొందరు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. నలుగురు దొంగలు పోతే పోయారని, వారి వల్ల జరిగే నష్టమేమీ లేదన్నారు కౌశిక్ రెడ్డి.

బీఆర్ఎస్ కి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల బలం ఉందని, వేలాదిమంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఉన్నారని, లక్షలాది కార్యకర్తల బలంతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు కౌశిక్ రెడ్డి. పోయేవాళ్లు పోయినా పార్టీకోసం, కేసీఆర్ కోసం తాము నిలబడే ఉంటామన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. పోచారం వెళ్లిపోయిన సందర్భంలో కౌశిక్ రెడ్డి ఈ మాటలు చెప్పగా, ఆయన ప్రసంగం పూర్తయిన గంటల వ్యవధిలోనే మరో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీకి దూరమయ్యారు. బీఆర్ఎస్ తరపున మొత్తం 39మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలవగా, వారిలో లాస్యనందిత మరణించారు, ఆ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి దక్కింది. మిగతా 38మందిలో ఇప్పటి వరకు ఐదుగురు పార్టీ మారారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కి తగ్గింది. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని కాంగ్రెస్ చెబుతోంది, ఎంతమంది పార్టీ మారినా బీఆర్ఎస్ ని దెబ్బకొట్టడం కష్టమని మిగిలిన నేతలు చెబుతున్నారు.

First Published:  24 Jun 2024 8:34 AM IST
Next Story