నేడే బీఆరెస్ బహిరంగ సభ... అన్ని ఏర్పాట్లు పూర్తి
ఈ సభలో హాజరయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హైదరాబాద్ కు చేరుకున్నారు.
దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రధాన రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే బీఆరెస్ బహిరంగ సభ మరొ కొద్ది గంటల్లో ఖమ్మంలో జరగనుంది. తన తొలి బహిరంగ సభ ద్వారా బీఆర్‌ఎస్ భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా మారనుంది.
ఐదు పార్టీలు... BRS, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M)), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) కలిసి ప్రతిపక్షాల ఐక్యతను ప్రదర్శించనున్నాయి.
ఈ సభలో హాజరయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హైదరాబాద్ కు చేరుకున్నారు.
దేశ ప్రగతి కోసం జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రచారం చేస్తున్న కేసీఆర్ ఈ సమావేశంలో రైతు కేంద్రంగా, అభివృద్ధి ఆధారిత ఎజెండాను ఆవిష్కరించనున్నారు. మెరుగైన దేశ భవిష్యత్తు కోసం తీసుకురావాల్సిన విధానాలు, సంస్కరణలతో సహా ప్రత్యామ్నాయ రాజకీయాలపై తన ఆలోచనలను సభావేదికగా ఈ రోజు కేసీఆర్ పంచుకుంటారు.
మొత్తం ఆరుగురు జాతీయ నాయకులు ఖమ్మంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనలను నాయకులు పంచుకుంటారు.
“దేశ ప్రజలలో ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచనను ప్రేరేపించడమే ప్రధాన లక్ష్యం. కేవలం నాలుగు రాజకీయ పార్టీల నాయకులు మాత్రమే సమావేశానికి హాజరవుతున్నప్పటికీ, జనతాదళ్ (సెక్యులర్) వంటి అనేక ఇతర భావసారూప్యత గల పార్టీల నాయకులు మాతో ఉన్నారు.వారు ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నప్పటికీ భవిష్యత్తులో BRS నిర్వహించే ఇతర బహిరంగ సభలకు వారు హాజరు కానున్నారు” అని BRS నాయకులొకరు మీడియాతో అన్నారు.
నూతన ఆర్థిక, పర్యావరణ, విద్యుత్, నీరు, మహిళా సాధికారత విధానాల ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించే అవకాశం ఉంది. 'ప్రత్యామ్నాయ రాజకీయాల' గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అనేక రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ సమావేశం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో BRS ప్లాన్ చేస్తున్న వరుస బహిరంగ సభలకు ఖమ్మం సమావేశం మార్గనిర్దేశం చేస్తుంది.
మరో వైపు బీఆరెస్ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయాలను కల్పించారు. ఇప్పటికే ఖమ్మం పట్టణమంతా గులాబీ మయమయ్యింది. కేసీఆర్, కేటీఆర్ కటౌట్లతో పాటు, సభకు వస్తున్న ఇతర పార్టీల నాయకుల కటౌట్లు కూడా ఖమ్మంలో ఏర్పాటు చేశారు.