నీట్ రద్దు చేయండి.. పేపర్ లీకేజీపై విచారణ చేపట్టండి
బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయని, ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయని, దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై న్యాయపోరాటం మొదలు పెట్టింది బీఆర్ఎస్. కేంద్రం వైఖరిని తప్పుబడుతూ తెలంగాణలో ఆందోళనలు చేపట్టింది. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఈరోజు రాజ్‌భవన్‌ను ముట్టడించారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని స్టేషన్ కి తరలించారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడంలేదని విద్యార్థులు ప్రశ్నించారు.
మరోవైపు నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బీఆర్ఎస్, కేంద్రాన్ని టార్గెట్ చేసింది. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయని, ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయని, దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్.
తెలంగాణ రాష్ట్రం నుంచి చాల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారని, వారిలో కేవలం 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకు పోతున్నారని చెప్పారు వినోద్ కుమార్. నీట్ పరీక్షలో సీటు వచ్చినా తెలంగాణ పిల్లలు వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మరికొన్ని కాలేజీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారాయన. అసలు నీట్ పరీక్ష వల్ల మన పిల్లలకు లాభం జరుగుతుందా, లేదా అనే విషయంపై ఎక్స్ పర్ట్ కమిటీ వేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడు విద్యార్థులు ధర్నా చేస్తున్నారని, మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్లాలని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వినోద్ కుమార్.