Telugu Global
Telangana

ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు షాక్‌ ఎందుకంటే..?

వేములవాడ, ఖానాపూర్‌, వైరా, అసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అయితే ఈ స్థానాల్లో సిట్టింగ్‌లకు సీటు ఎందుకు నిరాకరించారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈ ఏడుగురు ఎమ్మెల్యేలకు షాక్‌ ఎందుకంటే..?
X

యావత్‌ తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చేసింది. ఒకేసారి 115 స్థానాలకు 114 మంది అభ్యర్థులను ప్రకటించి విపక్షాలతో పాటు ఏడుగురు సిట్టింగ్‌లకు షాకిచ్చారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ఈ లిస్టులో వేములవాడ, ఖానాపూర్‌, వైరా, అసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అయితే ఈ స్థానాల్లో సిట్టింగ్‌లకు సీటు ఎందుకు నిరాకరించారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్న స్థానాల్లో వేములవాడ ఒకటి. ఇక్కడి నుంచి చెన్నమనేని రమేష్‌ బాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మంచి ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ.. ఆయన పౌరసత్వ వివాదం కారణంగానే టికెట్ నిరాకరించినట్లు స్పష్టం చేశారు కేసీఆర్‌. చెన్నమనేని పౌరసత్వ వివాదం ఇంకా కోర్టుల్లోనే ఉంది. ఇదే సమయంలో ఆయన ఎక్కువ జర్మనీలోనే ఉంటారన్న విమర్శ కూడా ఉంది. చెన్నమనేని స్థానంలో కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన చల్మెడ ఆనందరావుకు టికెట్ కన్ఫామ్ చేశారు గులాబీ అధినేత.

ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మూడు స్థానాల్లో సిట్టింగ్‌లకు షాకిచ్చారు కేసీఆర్‌. ఖానాపూర్‌లో వరుసగా రెండు సార్లు రేఖానాయక్ విజయం సాధించారు. అయితే ఈసారి రేఖానాయక్‌కు గులాబీబాస్‌ మొండి చేయి చూపారు. నియోజకవర్గంలో కొంతకాలంగా యాక్టివ్‌గా ఉంటున్న కేటీఆర్ స్నేహితుడు, NRI జాన్సన్ నాయక్‌కు టికెట్‌ ఫైనల్ అయింది. రేఖానాయక్‌ వ్యవహర శైలితో స్థానిక నేతలు ఇబ్బంది పడటం, ఈసారి టికెట్‌ ఇచ్చినా ఫలితం లేదని తేలడంతో టికెట్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఇక ఆసిఫాబాద్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని.. కోవా లక్ష్మీకి ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో కోవా లక్ష్మీ ఓడిపోయారు. త‌రువాత స‌క్కు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఈసారి కూడా కోవా లక్ష్మీకే టికెట్ కేటాయించిన కేసీఆర్‌.. ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆదిలాబాద్‌లో సిట్టింగ్‌కు షాకిచ్చిన మరో స్థానం బోథ్‌. ప్రస్తుత ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు బీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చింది. ఆయన స్థానంలో నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు ఛాన్సిచ్చింది. బాపూరావుపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడమే టికెట్‌ నిరాకరణకు కారణంగా తెలుస్తోంది.

ఇక హైదరాబాద్‌ సిటీలోని ఉప్పల్‌ అభ్యర్థిని మార్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బేతి సుభాష్‌ రెడ్డికి మొండి చేయి చూపారు. ఉప్పల్‌ సీటును బొంతు రామ్మోహన్‌ కూడా ఆశించారు. అయితే వీరిద్దరిని కాదని.. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు గులాబీ అధినేత. చివర్లో బండారుకు టికెట్ రాకుండా బొంతు, భేతీ సుభాష్‌ రెడ్డి ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కేసీఆర్ ఆయన వైపే మొగ్గు చూపారు. అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత కారణంగా భేతి సుభాష్ రెడ్డికి నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కు తెరదించారు కేసీఆర్‌. వివాదాలకు సెంటర్‌గా మారిన ప్రస్తుత ఎమ్మెల్యే రాజయ్యను తప్పించారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఛాన్సిచ్చారు. రాజయ్య 1997లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయారంగేట్రం చేశాడు. 2012లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్షంగా కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన రాజయ్య.. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అయితే ఇటీవల సర్పంచ్ నవ్య వివాదం ఎమ్మెల్యే రాజయ్యకు మైనస్‌గా మారింది.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించారు కేసీఆర్. వైరాలో ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్‌కు మొండి చేయి చూపారు. రాములు నాయక్‌ తీరుపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉండట‌మే టికెట్ నిరాకరించడానికి కారణమని తెలుస్తోంది. రాములు నాయక్‌కు స్థానంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్‌ ఇచ్చారు కేసీఆర్. సర్వేల్లో రాములు నాయక్‌కు వ్యతిరేకంగా రావడంతో టికెట్‌ నిరాకరించినట్లు సమాచారం.

First Published:  21 Aug 2023 11:54 AM GMT
Next Story