బీఆర్ఎస్ ప్రచార రథం రెడీ.. భారత దేశ పటంలో కేసీఆర్ నిలువెత్తు ఫొటో
కేసీఆర్ బహిరంగ సభలకు హాజరయ్యే వేళ ప్రచార రథంలో ఆయన పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రచారం కోసం కార్వాన్ ఏర్పాటుతో ఓ బస్సుని సిద్ధం చేశారు.
ఈరోజు బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల, అభ్యర్థులకు బీఫామ్ ల పంపిణీతోపాటు.. సాయంత్రం హుస్నాబాద్ లో తొలి ప్రచార సభ నిర్వహించబోతున్నారు సీఎం కేసీఆర్. ఈసీ షెడ్యూల్ ప్రకటన తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ ఇదే కావడం విశేషం. అనారోగ్యంతో కొద్దిరోజులుగా మీడియాకు, ఇతర సమీక్షలు, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేసీఆర్.. ఈరోజు మేనిఫెస్టో విడుదల కోసం బయటకొస్తున్నారు. పులి వస్తోంది అంటూ.. ఇప్పటికే కేసీఆర్ ఎంట్రీపై హైప్ పెంచారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ఎంట్రీ కోసం ప్రచార రథం కూడా సిద్ధమైంది.
ఆకట్టుకుంటున్న ప్రచార రథం..
కేసీఆర్ బహిరంగ సభలకు హాజరయ్యే వేళ ప్రచార రథంలో ఆయన పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రచారం కోసం కార్వాన్ ఏర్పాటుతో ఓ బస్సుని సిద్ధం చేశారు. తెలంగాణ ప్రగతి రథం పేరుతో పూర్తిగా గులాబి రంగుతో ఈ వాహనాన్ని తీర్చిదిద్దారు. వాహనం పై ఎక్కి ప్రసంగించే ఏర్పాటు ఉంది. వాహనం లోనుంచి బయట వ్యక్తులను చూసి అభివాదం చేసేందుకు కూడా ఏర్పాటు ఉంది. ఇక వాహనంపై కారు గుర్తుతోపాటు, భారత దేశ చిత్రపటం.. దాని ముందు సీఎం కేసీఆర్ నిలువెత్తు ఫొటో ఉంటుంది.
ప్రచార వాహనం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిందని అంటున్నారు. యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వాహనాన్ని సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈరోజు నుంచి తెలంగాణలో మొదలయ్యే ఎన్నికల ప్రచార సభల్లో ఈ వాహనం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.