కేసీఆర్ భారీ బహిరంగ సభ.. ఎక్కడ, ఎప్పుడంటే.?
ఆదివారం సాయంత్రం మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు KRMBకి అప్పగించడంపై సుదీర్ఘంగా చర్చించారు.
త్వరలోనే భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. ఈ బహిరంగ సభకు గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభ ద్వారా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు శ్రీశైలం, సాగర్ ఔట్‌లెట్ల అప్పగింత అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫస్ట్ టైమ్ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఆదివారం సాయంత్రం మాజీ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులు KRMBకి అప్పగించడంపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైలం, సాగర్ ఔట్‌లెట్లను అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. సాగు, తాగు నీటి ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టంచేశారు. జలవిద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఇక్కట్లు వస్తాయని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోబోమన్న కేసీఆర్.. ఈ విషయంలో పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్దామని నేతలకు సూచించారు. తాను పూర్తిగా కోలుకున్నానని.. ప్రజల్లోకి వస్తానని ఆయన చెప్పారు.
కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది బీఆర్ఎస్. ప్రభుత్వ అనాలోచిత వైఖరి.. కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతులకు గొడ్డలి పెట్టులా మారిందని బీఆర్ఎస్ ఆక్షేపించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.