బీఆర్ఎస్ జైత్రయాత్ర కర్నాటకతో మొదలు.. బీజేపీలో గుబులు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్-బీఆర్ఎస్ కూటమి తరపున తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటిస్తారని తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి కావాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారామె
సార్వత్రిక ఎన్నికలకంటే ముందు బీజేపీ భవితవ్యం తేల్చబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగాల్సి ఉంది. అందులో కర్నాటక కూడా ఒకటి. తెలంగాణకంటే ముందే కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కర్నాటక అసెంబ్లీ తో బీఆర్ఎస్ బోణీ కొట్టాలని చూస్తోంది. ఆ ఎన్నికలతోటే బీజేపీని కూడా తొలిదెబ్బ కొట్టాలని భావిస్తోంది. అక్కడ బీఆర్ఎస్-జేడీఎస్ గ్రౌండ్ వర్క్ పక్కాగా జరుగుతోంది.
కర్నాటకలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. 224 స్థానాల కర్నాటక అసెంబ్లీలో బీజేపీ బలం బొటాబొటిగా 120. ఈసారి అక్కడ బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందనే ఊహాగానాలున్నాయి. బీఆర్ఎస్ ఎంట్రీతో అది మరింత ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే పొరుగున ఉన్న తెలంగాణ పాలన ఎలాగుందో కర్నాటకలోని సరిహద్దు ప్రాంతాలకే కాదు, ఆ రాష్ట్రం మొత్తం తెలుసు. ఇక్కడ పథకాలు, అక్కడ పథకాలు.. అనే కంపేరిజన్ ఆల్రడీ మొదలైంది. కర్నాటక ఎన్నికల్లో స్థానిక జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ అక్కడ పోటీ చేయాలని చూస్తోంది. ఇప్పటికే తెలంగాణ మంత్రులు కర్నాటకలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్-బీఆర్ఎస్ కూటమి తరపున తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటిస్తారని తాజాగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రి కావాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారామె. డబుల్ ఇంజిన్ పాలన అంటూ గొప్పలు చెప్పుకున్న బీజేపీ, కర్నాటకలో చేసిన అభివృద్ధి శూన్యం అని అన్నారామె. తెలంగాణలో సామాజిక పింఛన్ 2016 రూపాయలయితే, కర్నాటకలో మాత్రం కేవలం 600 రూపాయలు మాత్రమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్-జేడీఎస్ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలను కర్నాటకలో ప్రవేశ పెడతామని చెప్పారు.
బీజేపీలో గుబులు..
మోదీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు, తెలంగాణ నుంచి పోటీ చేస్తారు, తమిళనాడులో ఆయనకోసం లోక్ సభ నియోజకవర్గం సిద్ధమైంది అంటూ లీకులిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే దానికంటే ముందే జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాత్రం వారు ఆశలు వదిలేసుకున్నారు. బీజేపీని ఇతర రాష్ట్రాల్లో బలోపేతం చేయడం పక్కనపెడితే, అధికారంలో ఉన్న కర్నాటకలో దాన్ని నిలుపుకోవడం ఆ పార్టీకి అసాధ్యమనే చెప్పాలి. కర్నాటకతోనే బీజేపీ పతనం మొదలవుతుంది, అదే ఎన్నికలతో బీఆర్ఎస్ బోణీ కొట్టి, జాతీయ పార్టీగా తన ఉనికి చాటుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు.